నియోజకవర్గాల పునర్విభజనపై నారా లోకేష్ అభిప్రాయాలకు చిదంబరం సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. దానికి లోకేష్ రివర్స్ లో ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఎక్స్ లో ఇదే అంశం ట్రెండింగ్ అవుతోంది.
యాభై శాతం ఫార్ములాతో నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతినదని లోకేష్ అభిప్రాయపడటంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కౌంటర్ ఇచ్చారు. నా యువ మిత్రుడు నారా లోకేష్ డిలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు కాస్త లెక్కలు సరిచూసుకోవాలన్నారు. " ఆర్టికల్ 81ని మార్చకుండా వర్తింపజేస్తే, సాపేక్ష బలం పరంగా ఐదు దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని, ఉత్తరాది రాష్ట్రాలే లాభపడతాయని చిదంబరం పేర్కొన్నారు. బీజేపీ ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రతి రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని 50 శాతం పెంచుతామని భ్రమలు కల్పించిందని, ఏపీ సీట్లు 25 నుండి 38 కి పెరిగినా, ఓవరాల్‌గా దేశంలో ఏపీ ప్రాతినిధ్య శాతం తగ్గుతుందని విమర్శిస్తూ.. లోకేష్‌ను మళ్లీ లెక్కలు చూసుకోవాలని కోరారు.
చిదంబరం ట్వీట్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ అంతే ధీటుగా, సుదీర్ఘమైన రాజ్యాంగపరమైన వివరణతో కౌంటర్ ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల కేటాయింపు ఫ్రీజ్ చేశారు. ఈ రాజ్యాంగపరమైన గడువు 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కలతో ముగుస్తుంది అని లోకేష్ గుర్తు చేశారు. ఈ ఫ్రీజ్ తొలగించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని, మినహాయింపు లేకుండా ప్రతి దక్షిణాది రాష్ట్రం ఉత్తరాది రాష్ట్రాల కంటే సాపేక్ష ప్రాతినిధ్యాన్ని కోల్పోతుందని తాము మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అసమతుల్యతను సరిదిద్దడానికే ఎన్‌డీఏ ప్రభుత్వం డిలిమిటేషన్ బిల్లును , అన్ని రాష్ట్రాల పార్లమెంటరీ స్థానాల సమాన స్థాయిలో పెంపును ప్రతిపాదించిందని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని లోకేష్ ఎండగట్టారు. మీలాంటి ప్రతిష్టాత్మక చట్టపరమైన మేధావికి ఈ రాజ్యాంగ స్థితి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో డిలిమిటేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించింది? ఇది దక్షిణాది రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టి చేసిన రాజకీయ వ్యూహమా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టికల్ 81 ప్రకారం, 2026 జనాభా లెక్కల తర్వాత దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవా? అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ యంత్రాంగాన్ని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
లోకేష్ రిప్లయ్‌కు చిదంబబరం సమాధానం చెప్పాల్సి ఉంది.

