తెలంగాణ పోలీసుల్ని అమిత్ షా సన్మానించారు. నక్సలిజం అంతం చేయడంలో వారి పాత్ర కీలకమని ప్రశంసించారు. అయితే ఇక్కడ తెలంగాణ పోలీసులు నక్సలైట్లను అంతం చేయలేదు..
నక్సలిజాన్ని అంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్ కౌంటర్లను కాకుండా సరెండర్లను ప్రోత్సహించడం వల్లే ఇదిసాధ్యమయింది.
సీనియర్ నక్సల్స్ ప్రాణాలు నిలిపిన తెలంగాణ మోడల్
తెలంగాణను నక్సలిజం కోరల నుంచి విముక్తం చేయడంలో మన పోలీసులు అనుసరించిన తెలంగాణ మోడల్ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల్లో నక్సల్స్ నిర్మూలన అంటే కేవలం ఎదురుకాల్పులు మాత్రమే అనే భావన ఉండేది. కానీ, తెలంగాణ పోలీసులు మాత్రం క్షేత్రస్థాయిలో ఆపరేషన్ అండ్ కౌన్సెలింగ్ అనే ద్విముఖ వ్యూహాన్ని అమలు చేశారు. ఎన్‌కౌంటర్ల ద్వారా రక్తపాతం సృష్టించడం కంటే, నక్సలైట్లలో మార్పు తీసుకువచ్చి వారు జనజీవన స్రవంతిలో కలిసేలా సరండర్ల కు ప్రాధాన్యత ఇవ్వడం తెలంగాణ విజయంలో కీలక మలుపుగా మారింది. అందుకే ఎంతో మంది అగ్రనేతల ప్రాణాలు మిగిలాయి.
విశ్వాసమే అసలైన ఆయుధం
నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ఫోర్స్ పనిచేసింది. కేవలం గాలింపు చర్యలకే పరిమితం కాకుండా, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సహకరించడం, యువతకు ఉపాధి మార్గాలు చూపడం వంటి చర్యల ద్వారా నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌కు అడ్డుకట్ట వేశారు. అడవిలో ఉన్న వారు ఆయుధాలు వీడి వస్తే, ప్రభుత్వం అందించే పునరావాస ప్యాకేజీలు పక్కాగా అందుతాయనే భరోసాను కల్పించడంలో ఇంటెలిజెన్స్ ,ఎస్‌ఐబి బృందాలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి.
సరండర్ పాలసీ.. సక్సెస్ ఫుల్ స్టోరీ
తెలంగాణ పోలీసులు కేవలం బలప్రయోగాన్ని చివరి ఆప్షన్‌గా మాత్రమే పెట్టుకున్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించడం, వారి పిల్లల చదువులకు, ఉపాధికి భరోసా ఇవ్వడం వల్ల అగ్రనేతలు సైతం ఆయుధాలు విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నక్సల్స్ గడ్డగా పేరుగాంచిన ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. అమిత్ షా చేతుల మీదుగా సన్మానం అందుకున్న అధికారుల కృషి వెనుక వేలాది మంది కింది స్థాయి సిబ్బంది త్యాగాలు, అంకితభావం దాగి ఉన్నాయి. వారి కృషి పెద్ద ఎత్తున ప్రాణాల్ని నిలబెట్టిందనడంలో సందేహం లేదు.

