Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మ..మ..మావిగన్ !

మ..మ..మావిగన్ !

Telugu 360 1 week ago

"మూర్ఖుడికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు.. సర్వనాశనం అయిపోయాక గానీ కనువిప్పు కలగదు" అనే సామెత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యూహాలకు అచ్చంగా సరిపోతుంది.

ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి, అభివృద్ధిని పడకేయించి, ఎన్నికల్లో ప్రజల చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసినా జగన్ రెడ్డిలో మార్పు రాలేదని ఆయన తాజా సవాల్ నిరూపిస్తోంది.

గత ఎన్నికల్లో ప్రజల ఏకపక్ష తీర్పు!

గతంలో జగన్ రెడ్డి మూడు రాజధానుల ముసుగులో భయంకరమైన ప్రాంతీయ విభజన రాజకీయం సాగించారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తే టీడీపీ ఉత్తరాంధ్రకు, రాయలసీమకు శత్రువు అవుతుందంటూ నాడు చంద్రబాబు నాయుడిపై మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించారు. కానీ, ఆ కుతంత్రాన్ని చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టారు. మన రాజధాని అమరావతే.. రాష్ట్ర అభివృద్ధికి అమరావతే గుండెకాయ అని అటు కర్నూలుకు, ఇటు విశాఖపట్నానికి స్వయంగా వెళ్లి మరీ ప్రజలకు వివరించారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి ఏకపక్షంగా, చారిత్రాత్మకమైన మద్దతు ఇచ్చి జగన్ రెడ్డిని పాతాళంలోకి తొక్కిపడేశారు. అమరావతికి ప్రజల నుండి పూర్తిస్థాయి ఆమోదం లభించిందని ఆ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయి.

వైసీపీ నేతలే బిత్తరపోయే పిచ్చి రాజకీయం

అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో.. అమరావతి కావాలా.. మావిగన్ కావాలా అంటూ జగన్ రెడ్డి ప్రజలను ప్రశ్నించడం చూసి సామాన్యులే కాదు, చివరికి వైసీపీ సొంత పార్టీ నేతలు కూడా బిత్తరపోతున్నారు. ఇంత పిచ్చి రాజకీయం చేసే నాయకుడిని మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంటూ సొంత క్యాడర్‌లోనే అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజధాని లాంటి సున్నితమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశంపై ఒకసారి అమరావతి, మరోసారి మూడు రాజధానులు, ఇప్పుడు సడన్‌గా మావిగన్ అంటూ పదే పదే మాట మారుస్తుంటే.. ఆ నవ్వులపాలు కావడం తమ వల్ల కాదంటూ చాలా మంది వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తలలు పట్టుకుంటున్నారు.

మొఖం మీదే నవ్వుతారని తెలిసినా.. మావిగన్ పచ్చబొట్లు తప్పవు!

వైసీపీలో ఉన్న విషాదం ఏంటంటే.. అధినేత ఏం చెప్పినా దానికి తలూపడం మినహా మరో ప్రత్యామ్నాయం ఆ పార్టీ నేతలకు లేదు. రేపు జనంలోకి వెళ్తే జనం తమ మొఖం మీదే పుసుక్కున నవ్వుతారని, అయ్యా! మొన్నటిదాకా విశాఖపట్నం అన్నారు.. ఇప్పుడేంటి కొత్తగా మావిగన్ అంటున్నారు అని నిలదీస్తారని తెలిసినా.. వచ్చే ఎన్నికల నాటికి వీరంతా మావిగన్ పచ్చబొట్లు పొడిపించుకుని ప్రచారానికి వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడబోతోంది. అయితే, గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి మార్క్ తుగ్లక్ నిర్ణయాలను సమర్థించి సమర్థించి వైసీపీ నేతలకు ఇలాంటి పొలిటికల్ కామెడీలు అలవాటైపోయాయి.

సీరియస్సైనా.. కామెడీలైనా లైట్ తీసుకోవడమే!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన రాజధాని అంశాన్ని జగన్ రెడ్డి ఇంత దారుణంగా కామెడీ చేస్తుంటే.. దానిని సీరియస్‌గా తీసుకుని చర్చించాలా, లేక ఇదంతా జగన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ డ్రామా అని లైట్ తీసుకుని వదిలేయాలా అని నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా, ఒక్కటి మాత్రం స్పష్టం.. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, ఇంకా పాత అహకారంతో నకిలీ నినాదాలను నమ్ముకుంటే, భవిష్యత్తులో వైసీపీ అనే పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ కూడా లేకుండా ప్రజలు మూసివేయడం ఖాయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360