Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంచి అంతా మాదే - రాసేసుకుంటున్న వైసీపీ!

మంచి అంతా మాదే - రాసేసుకుంటున్న వైసీపీ!

Telugu 360 6 days ago

ఆంధ్రప్రదేశ్‌లో ఏ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభమైనా, ఏ దిగ్గజ సంస్థ పెట్టుబడులు తెచ్చినా.. ఇది మా ఘనతే, ఆ క్రెడిట్ మాదే " అంటూ వైసీపీ తెరపైకి రావడం పరిపాటిగా మారింది.

విశాఖపట్నంలో భారీ గూగుల్ డేటా సెంటర్ ప్రకటన మొదలుకొని, ప్రకాశం జిల్లా జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు విడుదలయ్యే వరకు ప్రతి సందర్భంలోనూ వైసీపీ క్రెడిట్ క్లెయిమ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టుల పురోగతి, పెట్టుబడుల రాక వంటి కీలక పరిణామాలపై క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా సొంత మీడియా, సోషల్ మీడియా వేదికగా అదేపనిగా ఒకే ప్రచారాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

జగన్ ఏమీ చేయలేకపోయారని ప్రజలకు గుర్తుండదా?

ఐదేళ్ల పూర్తి పాలనాకాలం ప్రజలకు అందుబాటులో ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే స్పష్టత ప్రజల కళ్ల ముందే ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల వేగవంతమైన నిర్మాణంలో కానీ ఆశించిన పురోగతి కనిపించలేదన్నది కాదనలేని వాస్తవం. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించకుండా, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్ల పనులు సంపూర్ణం కాకుండానే ఎన్నికల ముందు హడావిడిగా పైలాన్ ఆవిష్కరణలు చేయడం ప్రజలు గమనించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయి అడ్డంకులను తొలగించి, నిర్వాసితులకు పరిహారం అందించి నీటిని విడుదల చేస్తుంటే.. మేమే అంతా చేశాం అంటూ గత పాలకులు చెప్పుకోవడం సాధారణ పౌరులకు సైతం సహేతుకంగా అనిపించడం లేదు.

పనిగట్టుకుని నవ్వుల పాలు కావడమే

అదేవిధంగా పారిశ్రామిక, ఐటీ పెట్టుబడుల విషయంలోనూ ఇదే తీరు కొనసాగుతోంది. గూగుల్ డేటా సెంటర్ లాంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చినప్పుడు.. పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నాయకత్వ విశ్వసనీయత, మౌలిక వసతుల కల్పనపై ఆధారపడి సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి. పాత ప్రతిపాదనలు లేదా ఎంవోయూల పేరు చెప్పి నేటి భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం వల్ల రాజకీయంగా పార్టీకి ప్రయోజనం కలగడం కంటే, నవ్వులపాలు కావడమే ఎక్కువవుతోంది. గ్రౌండింగ్ కాని పనులకు, సాధించలేని లక్ష్యాలకు మైలేజ్ ఆశించడం ప్రజల్లో చులకన భావాన్ని పెంచుతోంది.

ప్రజలకు ఏమీ తెలియదని ఎందుకనుకుంటారు?

సొంత మీడియా , సోషల్ మీడియా సైన్యాల ద్వారా వాస్తవాలను పక్కనబెట్టి బలవంతంగా ప్రచారాన్ని ముందుకు నెట్టడం ఒక పరిమితి వరకే పనిచేస్తుంది. డిజిటల్ యుగంలో ప్రజల వద్ద ప్రతి ప్రాజెక్టు టైమ్‌లైన్, బడ్జెట్ కేటాయింపులు, క్షేత్రస్థాయి పురోగతికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటోంది. గతంలో జరిగిన మంచి పనులను ప్రస్తావించడం సహజమే అయినప్పటికీ, ప్రతి చిన్న అభివృద్ధికి, కొత్త పెట్టుబడికి మేమే ఆధారం అంటూ అసంబద్ధ వాదనలు వినిపించడం ప్రజల్లో విశ్వసనీయతను మరింత తగ్గిస్తుంది. కాలానుగుణంగా రాజకీయ వ్యూహాలను మార్చుకోకుండా, ఇంకా పాత ప్రచార పంథాలోనే కొనసాగితే.. ప్రజల దృష్టిలో వైసీపీ క్రమంగా మరింత వింతైన, వాస్తవ దూరమైన పార్టీగా ముద్రపడుతుంది. ఇప్పటికీ ఆ ముద్ర పడిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360