రాజకీయాల్లో తమకు తాము మంచోళ్లం అని చెప్పుకోవడం సాధారణమే కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు తాను ఇచ్చుకున్న మంచోడు సర్టిఫికెట్ మాత్రం ప్రత్యేకం.
ఆయన ఎంత మంచోడో, ఆయన మనస్తత్వం ఎలాంటిదో సొంత కుటుంబ సభ్యుల నుంచి మొన్నటివరకు జైల్లో ఉండి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు అందరూ లైన్ కట్టి మరీ గుర్తు చేసుకుంటున్నారు. సమాజం ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోవడం లేదని అనుకోవాలి.
కుటుంబ సభ్యులపై ఎంత మంచితనమో !
నిజంగా జగన్ రెడ్డి ఎంత మంచోడు కాకపోతే.. ఆయన మంచితనం చూసే కదా ఆనాడు స్వయంగా వైఎస్ రాజశేఖరరెడ్డి గారే బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లగొట్టింది! ఆయనలోని మితిమీరిన మంచితనాన్ని భరించలేకే కదా.. కన్నతల్లి విజయమ్మ నీ మంచితనం నాకు వద్దు నాయనా అంటూ చీకొట్టి సాగనంపింది. ఇక సొంత చెల్లి షర్మిలమ్మనైతే ఎంత మంచితనంతో చూసుకున్నారంటే.. పార్టీ కోసం ఆమె రక్తం చెమటా కార్చి పాదయాత్ర చేస్తే, ఆ కృతజ్ఞతతో ఆమెను ఏకంగా పార్టీ నుంచే వెళ్లగొట్టి, ఈరోజు తనకు బద్దశత్రువుగా మారేలా పక్కా ప్లాన్ గీశారు. ఇదంతా అన్నగారి అపారమైన అమాయకత్వం కాకపోతే ఇంకేంటి?
ఎంత మంచితనం కాకపోతే సతీష్ రెడ్డిని పక్కన పెట్టుకుంటారు?
ఇక మరో చెల్లి సునీతమ్మ అనుభవిస్తున్న సంతోషం అంతా ఇంతా కాదు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత ఘోరంగా గొడ్డలితో నరికి చంపిన నిందితులను జగన్ రెడ్డి ఎంత మంచితనంతో కాపాడుతున్నారో చూసి ఆమె రోజూ కోర్టుల చుట్టూ తిరుగుతూ అన్నగారి నామాన్ని స్మరిస్తోంది. ఎంతైనా సొంత తాత రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ కుమార్ రెడ్డిని చేరదీసి, పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి పక్కన పెట్టుకున్నారంటే.. జగన్ రెడ్డి శత్రువును కూడా ప్రేమించే యేసుప్రభువు లాంటి మంచోడని ఒప్పుకోక తప్పదు.
ఈ పరమ మంచితనంతో జగన్‌కు లేనిపోని కష్టాలు
ఇలాంటి పరమ పవిత్రమైన మనస్తత్వం ఉంది కాబట్టే.. చట్టం కూడా ఆయన మంచితనాన్ని గౌరవించి ఏకంగా 16 నెలల పాటు చంచల్‌గూడ జైల్లో చిప్పకూడు తినిపించి ప్రత్యేకంగా సత్కరించింది. ఇప్పటికీ ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేసే భాగ్యాన్ని కల్పించింది. అంతెందుకు, గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూడా ఆయన మంచితనానికి ముగ్ధులైపోయి.. ఏకంగా 151 సీట్ల నుంచి సింగిల్ డిజిట్ ముంగిట పరిమితం చేసి తాడేపల్లి ప్యాలెస్‌లో రెస్ట్ తీసుకోమన్నారు. ఇంత జరిగినా ఇంకా జనాల్లో నమ్మకం కలగడం లేదని, తానే మంచోడ్ని అంటూ జగన్ రెడ్డి మైకుల ముందుకు వచ్చి సెల్ఫ్ కొట్టుకోవడం చూస్తుంటే.. ప్రజలు కూడా.. నమ్మండ్రా బాబూ అని బతిమాలుకుంటున్నారు.

