సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు మనోజ్ మంచి స్పీడే చూపిస్తున్నాడు. 'మిరాయ్' లో తాను చూపించిన విలనిజానికి ఫిదా అయిపోయారంతా. ఆ తరవాత తనకు అలాంటి రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో కూడా తను నటిస్తున్నాడు. 'మిరాయ్ 2' కూడా ఇటీవలే పట్టాలెక్కింది. మరోవైపు హీరోగానూ సినిమాలు ఒప్పుకొంటున్నాడు. అందులో భాగంగానే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఓ సినిమాని మొదలెట్టారు. ఈరోజు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'వడ్డీ కాసులవాడ` అనే పేరు ఖరారు చేశారు. పేరుకి తగ్గట్టే.. సినిమా అంతా అప్పులు, ఈఎంఐలు, వడ్డీల చుట్టూ తిరుగుతుంది.
గ్లింప్స్ లో ఓ సగటు మధ్యతరగతి యువకుడి కష్టాల్ని చాలా ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. తిరుపతి వెంకటేశ్వరుడ్ని ఈ కథలో భాగం చేస్తూ, ఆయన పేరుతో టైటిల్ రివీల్ చేయడం కూడా బాగా కుదిరింది. మధ్యలో మనోజ్ చెప్పిన డైలాగులు, తండ్రి మోహన్ బాబుని ఇమిటేట్ చేసిన విధానం ఇవన్నీ ఆసక్తిని కలిగించాయి. ఈ గ్లింప్స్… ఏఐ సహకారంతో తీసినట్టుగా అర్థం అవుతోంది. షూటింగ్ ఎంత వరకూ జరిగింది, మిగిలిన నటీనటుల మాటేంటి అనే విషయాలు తెలియాల్సివుంది. తేజ్ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొత్తానికి గ్లింప్స్ తో, టైటిల్ తో ఆసక్తిని పెంచేశాడు మనోజ్. ఇక సినిమా ఎలా వస్తుందో చూడాలి.

