Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంగళగిరి ఆఫీసులోనే మహానాడు !

మంగళగిరి ఆఫీసులోనే మహానాడు !

Telugu 360 1 week ago

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు నిర్వహణపై ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు వేదికగా మూడు రోజుల పాటు భారీ బహిరంగ సభతో నిర్వహించాలనుకున్న ముందస్తు ప్రణాళికలో మార్పులు చేస్తూ, ఈసారి 'హైబ్రిడ్' విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది.

మూడు రోజుల వేడుకల స్థానంలో, మే 27, 28 తేదీల్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడును నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. భారీ ఆడంబరాలకు పోకుండా, పార్టీ సిద్ధాంతాలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈ వేదికను వినియోగించుకోనున్నారు.

మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్‌గా కార్యక్రమం జరుగుతుండగా, జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి కేవలం పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు , అధికార ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించారు. మిగిలిన వారందరూ తమ తమ ప్రాంతాల నుంచే డిజిటల్ పద్ధతిలో భాగస్వాములు కానున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఆన్‌లైన్ విధానంలో మహానాడుకు హాజరయ్యేలా పార్టీ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాల నుంచి ఈ డిజిటల్ మహానాడులో పాల్గొంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే టీడీపీ, ఈ హైబ్రిడ్ విధానం ద్వారా పార్టీ శ్రేణులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే కాకుండా, సమయాన్ని, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని భావిస్తోంది.

వేదిక మారినా, నిర్వహణ పద్ధతి మారినా మహానాడు సంప్రదాయాలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ తీర్మానాలు, రాజకీయ, ఆర్థిక , సామాజిక అంశాలపై చర్చలు హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహిస్తారు. వర్చువల్‌గా పాల్గొనే సభ్యుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించేలా అధునాతన సాంకేతికతను వాడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360