తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విజయవంతమైన కెమెరామెన్ గా గుర్తింపు పొందారు రవి.కె.చంద్రన్. తెలుగులో ఆయన చేసిన భరత్ అనే నేను, భీమ్లా నాయక్, ఓజీ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
దర్శకుడిగానూ ఆయనకు అనుభవం ఉంది. తమిళ, మలయాళ భాషల్లో ఒక్కో సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నారని సమాచారం.
ఆయన ఓ వినోదాత్మక కథ సిద్ధం చేసుకొన్నారని, కథానాయకుడు సునీల్ కి వినిపించారని తెలుస్తోంది. సునీల్ కూడా ఈ కథకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఒకట్రెండు నిర్మాణ సంస్థల దగ్గరకు ఈ కథని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు సునీల్. కాంబో ఇంట్రెస్టింగ్ గా ఉందని కాబట్టి… నిర్మాత దొరకడం పెద్ద కష్టమేం కాదు. అన్నీ కుదిరితే ఈ వేసవిలోగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ బయటకు వచ్చే అవకాశం ఉంది.
సునీల్ తన కెరీర్‌ని చక్కగా ప్లాన్ చేసుకొంటున్నారు. విలన్ గా, కమిడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే, హీరోగా వచ్చిన అవకాశాల్ని వదులుకోవడం లేదు. అయితే ప్రతీ కథనీ ఆయన ఒప్పుకోవడం లేదు. సెలెక్టీవ్ గానే వెళ్తున్నారు. అందులో భాగంగానే రవికె చంద్రన్ కథకు ఓకే చెప్పారు. సరైన నిర్మాత దొరకడమే ఆలస్యం.

