Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెలోడీ.. రాహుల్‌కు జెలసీ !

మెలోడీ.. రాహుల్‌కు జెలసీ !

Telugu 360 3 days ago

అంతర్జాతీయ దౌత్య ఘటనలు కొన్ని సార్లు ఆహ్లాదంగా ఉంటాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారతీయ బ్రాండ్ అయిన పార్లే మెలోడీ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇవ్వడం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

సోషల్ మీడియాలో వీరిద్దరి కాంబినేషన్‌కు నెటిజన్లు పెట్టిన మెలోడి అనే హ్యాష్‌ట్యాగ్‌కు సరిగ్గా సరిపోయేలా ప్రధాని ఈ చాక్లెట్ గిఫ్ట్ ఇవ్వడం, దాన్ని మెలోని స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మీమ్స్ రాయుళ్లకు పండగైపోయింది.

మెలోడీ ఇంత చాక్లెటీగా ఎందుకుంటుంది అంటూ పాత అడ్వర్టైజ్‌మెంట్ డైలాగులతో నెటిజన్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఫన్నీ మీమ్స్‌తో హోరెత్తించారు.

అయితే, ఈ సరదా చాక్లెట్ ముచ్చటను రాజకీయంగా సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. పశ్చిమాసియా సంక్షోభం, ఆర్థిక సవాళ్లు, పొదుపు చర్యలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఇటలీకి వెళ్లి క్యాండీలు పంచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , ఆ పార్టీ వర్గాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అంతర్జాతీయ వేదికలపై దేశ సమస్యలను ప్రస్తావించకుండా ఇటువంటి రీల్స్ చేయడం ఏంటని ప్రతిపక్షం ప్రశ్నించింది.

ప్రతిపక్షాల ఈ సీరియస్ రియాక్షన్‌పై నెటిజన్లు, అధికార పార్టీ మద్దతుదారులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ప్రపంచ దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని పెంపొందించుకోవడానికి ఇటువంటి స్నేహపూర్వక హావభావాలు కూడా ఒక భాగమేనని, దీన్ని కూడా తప్పుబట్టడం కుళ్లు కాకపోతే మరేంటని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. కేవలం ఒక చాక్లెట్ ప్యాకెట్‌తో భారతీయ బ్రాండ్‌కు అంతర్జాతీయంగా ఉచిత ప్రచారం లభించిందని, పార్లే కంపెనీ కూడా హ్యాపీగా ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు కోపగించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.

ఏదేమైనప్పటికీ, అటు ఇటలీతో రక్షణ, వాణిజ్య రంగాల్లో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంటూనే.. ఇటు మెలోడీ చాక్లెట్‌తో డిజిటల్ మీడియాను ప్రధాని మోదీ ఆకర్షించగలిగారు. రాహుల్ కు మాత్రం ఇది నచ్చలేదని ఆయన స్పందనను. బట్టి అర్థమైపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360