జీ, ఎస్సెల్ గ్రూప్ సంస్థల ఫౌండర్ సుభాష్ చంద్ర దివాలా తీశారు. తన వద్ద రూపాయి కూడా లేదని అంటున్నారు. ఆయన సాధారణ బిజినెస్ మెన్ కాదు. మరి ఎలా దివాలా తీశారు..?
భారతీయ బిజినెస్ ప్రపంచంలో సుభాష్ చంద్ర ప్రయాణం ఒక అద్భుతమైన రోలర్‌కోస్టర్ రైడ్ లాంటిది. 1969లో 17 ఏళ్ల వయసులో కుటుంబం ఎదుర్కొన్న రూ. 3.5 లక్షల అప్పుల భారంతో చదువు ఆపేసిన ఆయన, శూన్యం నుంచి వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. 1992లో దూరదర్శన్ మాత్రమే ఉన్న కాలంలో, భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ ఛానెల్ జీ టీవీ ను ప్రారంభించి భారత మీడియా మొఘల్ గా అవతరించారు. ఎస్సెల్ ప్యాకేజింగ్, ఎస్సెల్ వరల్డ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ , జీ మీడియా ద్వారా ఆయన బహుముఖ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.
అపరిమితమైన అప్పులతో అసలుకే మోసం
అయితే, ఆయన సాధించిన అపారమైన విజయం వెనుక అపరిమితమైన అప్పులు అనే బిజినెస్ ప్రమాదం పొంచి ఉండిపోయింది. మీడియా రంగంలో విజయం సాధించిన తర్వాత, సుభాష్ చంద్ర తన వ్యాపారాన్ని మౌలిక సదుపాయాల , ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, సోలార్ పవర్, రోడ్లు, డిష్ టీవీ విస్తరణ , డిజిటల్ నెట్‌వర్క్‌ల వైపు విస్తరించారు. ఎస్సెల్ గ్రూప్ ద్వారా భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు.
ఇన్ ఫ్రా, సోలార్ ప్రాజెక్టులతో భారీ నష్టాలు
ఈ అప్పులే ఆయన సామ్రాజ్యానికి మొదటి గొడ్డలిపెట్టుగా మారాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , సోలార్ ప్రాజెక్టులలో అనుకున్నంత ఆదాయం రాకపోవడం, ఊహించని రీతిలో ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల గ్రూప్ తీవ్ర నగదు కొరత లో కూరుకుపోయింది. ప్రాజెక్టుల నుంచి వచ్చే రాబడితో అప్పుల వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు, తాను తీసుకున్న రుణాలకు సుభాష్ చంద్ర తన సొంత జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లను ఈక్యూటీగా తాకట్టు పెట్టడం అతిపెద్ద వ్యూహాత్మక పొరపాటైంది.
2019 నుంచి పతనం
అప్పులు తీర్చలేకపోవడంతో 2019 నుంచి రుణదాతలు తాకట్టులో ఉన్న జీ టీవీ షేర్లను విక్రయించడం ప్రారంభించారు. దీంతో ఎస్సెల్ గ్రూప్ తన ప్రధాన వ్యాపారమైన జీ టీవీలో మెజారిటీ వాటాను కోల్పోవలసి వచ్చింది. వందల కోట్ల అప్పులు తీర్చేందుకు ఆయన డిష్ టీవీ, పవర్ ప్లాంట్లు, మీడియా వాటాలను విక్రయించాల్సి వచ్చింది. అయినప్పటికీ, దాదాపు రూ. 22,000 కోట్లకు పైగా రుణాలకు సంబంధించి వ్యక్తిగత పూచీకత్తులు ఇవ్వడంతో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో ఆయనపై వ్యక్తిగత దివాలా ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. సొంత వ్యాపారాలు మినహా ఇతర ప్రమాదకర రంగాల్లోకి అప్పులతో అడుగుపెట్టడం, వ్యక్తిగత పూచీకత్తులతో షేర్లను తాకట్టు పెట్టడం ఏ స్థాయిలో ఉన్న వ్యాపారవేత్తనైనా ఎలా కోలుకోలేని దెబ్బతీస్తుందనే దానికి సుభాష్ చంద్ర ప్రయాణం ఒక నిదర్శనం.

