Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీడియా వాచ్ : బిగ్ టీవీ ఓనర్‌ది ఔదార్యమే!

మీడియా వాచ్ : బిగ్ టీవీ ఓనర్‌ది ఔదార్యమే!

Telugu 360 6 days ago

వార్తల వేటలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులను నిర్వర్తించే క్షేత్రస్థాయి జర్నలిస్టులకు ఆపదొస్తే ఆదుకునే యాజమాన్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటిది తన సంస్థలో పనిచేస్తున్న ఓ రిపోర్టర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలియగానే నిమిషాల వ్యవధిలోనే స్పందించి, ఏకంగా 12 లక్షలు సమకూర్చి ప్రాణాలు కాపాడిన బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి ఔదార్యం ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది.

విధుల్లో ప్రమాదాలకు గురైనా పట్టించుకోని యాజమాన్యాల నడుమ.. ఒక రిపోర్టర్ ప్రాణాలను నిలబెట్టేందుకు చూపిన ఈ మానవీయ స్పందన మీడియా రంగానికే ఆదర్శంగా నిలిచిందంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బిగ్ టీవీకి చెందిన ఢిల్లీ రిపోర్టర్ శివ గురువారం ఉదయం ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శరీరంలో ఎడమ చేయి, ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయి కుప్పకూలారు. ప్రాణాపాయ స్థితిని గుర్తించిన తోటి రిపోర్టర్ రాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆయన్ను ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసరంగా పరీక్షించిన వైద్యులు.. శివ ప్రాణాలు దక్కాలంటే తక్షణమే క్రిటికల్ సర్జరీ నిర్వహించాల్సి ఉంటుందని, అందుకు దాదాపు 12 లక్షల రూపాయలు చెల్లించాలని స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

అంత పెద్ద మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో సర్దుబాటు చేయడం ఆ కుటుంబానికి అసాధ్యమైన పరిస్థితుల్లో.. విషయం వెంటనే సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఉద్యోగి ప్రాణాపాయ స్థితిని తెలుసుకున్న ఆయన ఏమాత్రం ఆలోచించకుండా, క్షణాల వ్యవధిలోనే స్పందించారు. ఆసుపత్రి ఖాతాకు రూ. 12 లక్షలను బదిలీ చేయించారు. నిధులు సకాలంలో చేరడంతో వైద్యులు వెంటనే సర్జరీ ప్రక్రియను పూర్తి చేయగలిగారు. దీంతో రిపోర్టర్ శివ ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. సరైన సమయంలో అందిన ఆ సాయమే ఒక నిండు ప్రాణాన్ని, ఆ కుటుంబాన్ని నిలబెట్టింది.

సాధారణంగా మీడియా సంస్థల్లో పని ఒత్తిళ్లు, క్షేత్రస్థాయి రిస్కులు ఎదుర్కొంటూ జర్నలిస్టులు ప్రాణాల మీదికి తెచ్చుకున్నప్పుడు ముఖం చాటేసే యాజమాన్యాలనే ఎక్కువగా చూస్తుంటాం. కార్పొరేట్ ప్రయోజనాలే పరమావధిగా సాగే ప్రస్తుత కాలంలో.. ఒక రిపోర్టర్ ప్రాణం కోసం ఎలాంటి షరతులు లేకుండా ఇంత భారీ మొత్తాన్ని వెనుకాముందు చూడకుండా విడుదల చేయడం బిగ్ టీవీ యాజమాన్య పెద్దమనసుకు నిదర్శనం. జర్నలిస్ట్ సంఘాలు, సీనియర్ పాత్రికేయులు బిగ్ టీవీ యాజమాన్యాన్ని ప్రశంసిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360