Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీడియా వాచ్ : టీవీ ఛానళ్ల ప్రకటనలపై పరిమితి ఎత్తివేత

మీడియా వాచ్ : టీవీ ఛానళ్ల ప్రకటనలపై పరిమితి ఎత్తివేత

Telugu 360 3 days ago

టీవీ రంగానికి ఊరట నిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. టెలివిజన్ ఛానళ్లలో గంటకు గరిష్టంగా 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలనే రూల్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

1994 నాటి కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రూల్స్‌ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయగానే ఈ కొత్త విధానం అమలులోకి వస్తుంది.

2006లో ఈ 12 నిమిషాల ప్రకటనల పరిమితి 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు , 2 నిమిషాల స్వంత ఛానల్ ప్రోమోలు ప్రవేశపెట్టిన నాటికి దేశంలో కేవలం 62 టీవీ ఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అనలాగ్ కేబుల్ వ్యవస్థ కారణంగా ప్రసార పరిమితులు ఉండేవి. అయితే ప్రస్తుతం దేశంలో ఛానళ్ల సంఖ్య 900 దాటడంతో పాటు, DTH, డిజిటల్ కేబుల్, IPTV వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 300 నుంచి 500 కంటే ఎక్కువ ఛానళ్లు ప్రేక్షకులకు లభిస్తున్నాయని సమాచార ప్రసార శాఖ వివరించింది.

ఈ నిర్ణయానికి ప్రధానంగా డిజిటల్ మీడియాతో సమానమైన పోటీ వాతావరణాన్ని కల్పించడమే కారణమని ప్రభుత్వం పేర్కొంది. యూట్యూబ్, సోషల్ మీడియా, OTT లాంటి డిజిటల్ వేదికలపై ప్రకటనల సమయంపై ఎలాంటి ప్రభుత్వ పరిమితులూ లేకపోవడంతో సాంప్రదాయ టీవీ ఛానళ్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. పే-ఛానల్ అయినా, ఫ్రీ-టు-ఎయిర్ ఛానల్ అయినా టీవీ పరిశ్రమ పూర్తిగా ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడి పనిచేస్తోంది.

ఈ నిబంధనను తొలగించడం ద్వారా బ్రాడ్‌కాస్టింగ్ రారంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడం వల్ల ఛానళ్లు తమ ప్రకటనల సమయాన్ని స్వయంగా నిర్ణయించుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒకవేళ ఏదైనా ఛానల్ పరిమితికి మించి ప్రకటనలు ఇస్తే, ప్రేక్షకులు వందలాదిగా ఉన్న ఇతర డిజిటల్ ప్రత్యామ్నాయ ఛానళ్లకు మారే అవకాశం ఉండటంతో మార్కెట్ శక్తులే ప్రకటనల సమయాన్ని నియంత్రిస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360