కేంద్రంలోని నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించబోతున్నారు. మూడో విడత పాలనలో రెండేళ్ల కీలక మైలురాయిని దాటుతున్న తరుణంలో భారీ మార్పులు చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులలో ఎవరికి ఉద్వాసన పలుకుతారు, కొత్తగా ఎవరికి బెర్త్ దక్కబోతోందనే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి.
బండి సంజయ్ స్థానంపై ఉత్కంఠ.. రేసులో కొత్త ముఖాలు!
తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ పదవిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో ఆయన కుటుంబం చుట్టూ ముసిరిన వివాదాలు మరియు ఆయనకు రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండటం ఈ మార్పులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే, ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగిపోయినట్లు సంకేతాలు వెళ్లకుండా, జూన్ లో జరగబోయే విస్తరణలో బండి సంజయ్‌ను కేంద్ర బాధ్యతల నుంచి తప్పించి, రాష్ట్ర పార్టీలో కీలకమైన ఎలివేషన్ ఇచ్చే వ్యూహాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది.
మిత్రపక్షాల బలానికి తగ్గ ప్రాధాన్యత?
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి అత్యంత బలంగా ఉన్న తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో ఏపీ ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరును సమీక్షించడంతో పాటు, తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి కొత్తగా ఎవరిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ పెట్టుబడుల సాధనలో వేగంగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వ పంథాకు అనుగుణంగా, కేంద్రం నుంచి కూడా గరిష్ఠంగా సహాయం అందించేలా కీలక శాఖలను ఏపీ నేతలకు కేటాయించే అవకాశం ఉంది.
ఉద్వాసనల వెనుక పనితీరు - వివాదాలు
ఈసారి మంత్రివర్గ ప్రక్షాళనలో కేవలం రాజకీయ సమీకరణాలే కాకుండా, గత కొంతకాలంగా మంత్రుల పనితీరు, వారిపై ఉన్న వివాదాలను అధిష్టానం ప్రధాన కొలమానంగా తీసుకుంటోంది. ఢిల్లీ పెద్దల విశ్వసనీయతను కోల్పోయిన వారికి, స్థానికంగా పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైన వారికి నిర్మొహమాటంగా ఉద్వాసన పలికేందుకు ప్రధాని సిద్ధమయ్యారు. ముఖ్యంగా వివాదాల్లో చిక్కుకున్న నేతలను పక్కన పెట్టడం ద్వారా ప్రభుత్వ క్లీన్ ఇమేజ్‌ను కాపాడుకోవాలనేది బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహం. దానికి తగ్గట్లుగానే నిర్ణయాలు ఉండబోతున్నాయి.

