Dailyhunt
మోదీ టూర్ : బీఆర్ఎస్‌తో బంధంపై క్లారిటీ ఇచ్చేస్తారా?

మోదీ టూర్ : బీఆర్ఎస్‌తో బంధంపై క్లారిటీ ఇచ్చేస్తారా?

Telugu 360 1 week ago

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపైనే ఉంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న సభ కేవలం అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికే పరిమితం కాకుండా, రాబోయే ఎన్నికల సమీకరణాలకు ఒక దిక్సూచిగా మారబోతోంది.

ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి ఉండే సంబంధాలపై ఈ వేదిక నుంచి మోదీ ఇచ్చే సంకేతాల కోసం రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

పరేడ్ గ్రౌండ్స్ వేదికగా పొత్తు ల గుట్టు విడిపోయేనా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పట్ల మోదీ అనుసరించే వైఖరి అత్యంత కీలకం. ఒకవేళ మోదీ తన ప్రసంగంలో బీఆర్ఎస్ వైఫల్యాలను, గత పదేళ్ల పాలనను తీవ్రస్థాయిలో విమర్శిస్తే.. ఆ పార్టీతో పొత్తుకు ఆస్కారం లేదని, బీజేపీ ఒంటరి పోరాటానికే సిద్ధమనే స్పష్టత వస్తుంది. అలా కాకుండా, కేవలం కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్‌ను విస్మరిస్తే మాత్రం.. తెర వెనుక కొత్త సమీకరణాలు ఏవైనా మొదలయ్యాయా అనే అనుమానాలకు బలం చేకూరుతుంది.

బీఆర్ఎస్‌పై బీజేపీ వ్యూహం ఏమిటి?

తమిళనాట విజయ్ ఎంట్రీతో మారిన సమీకరణాల ప్రభావం పొరుగున ఉన్న తెలంగాణపై కూడా పడే అవకాశం ఉంది. జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలంటే బలమైన ప్రాంతీయ శక్తుల మద్దతు లేదా వారిని నిర్వీర్యం చేయడం అత్యవసరం. ఈ క్రమంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్‌ను మోదీ పరిగణనలోకి తీసుకోవడం లేదని భావించాలా? లేక ఎన్నికల నాటికి ఒక మిత్రపక్షం గా చూస్తారా? అన్నది ఆయన వాడే పదజాలంపై ఆధారపడి ఉంటుంది. మోదీ మౌనం కూడా ఒక్కోసారి పెద్ద సంకేతమే అవుతుంది. పరిగణనలోకి తీసుకోకోతే ఆ పార్టీని నిర్వీర్యం చేయడం లేదా విలీనం చేయడానికి ప్లాన్ చేసుకున్నారని కూడా అనుకోవచ్చు.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ- మధ్యలో బీఆర్ఎస్ ఎక్కడ?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ తన అస్త్రాలను సిద్ధం చేస్తోంది. అయితే, ఓట్ల చీలిక ఎవరికి లాభం కలిగిస్తుందనే లెక్కల్లో బీజేపీ అధిష్టానం ఉంది. బీఆర్ఎస్ మరీ బలహీనపడితే ఆ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తే.. మోదీ బీఆర్ఎస్‌పై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించే అవకాశం ఉంది. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రసంగం ఉండనుంది. మోదీ ఇచ్చే పొలిటికల్ సిగ్నల్స్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కొత్త దిశను నిర్దేశించనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360