చిన్న సినిమా 'ఇట్లు అర్జున' మరోసారి వాయిదా పడింది. ఈనెల 30న ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ.. ఇప్పుడు నవంబరు 6కి వెళ్లిపోయింది. దానికి కారణం..
'ఆదర్శ కుటుంబం' సినిమానే. అక్టోబరు 2, 9 తేదీల్లో కూడా ఇట్లు అర్జున సినిమా రిలీజ్ డేట్ పోస్టరు వేశారు. కానీ.. అదే సమయంలో 'ఆదర్శ కుటుంబం' వస్తుందనుకొని, సినిమాని వాయిదా వేసుకోవాల్సివచ్చింది. తీరా చూస్తే, ఆదర్శ కుటుంబం రాలేదు.
ఆమధ్య ప్రెస్ మీట్ పెట్టి, ఇట్లు అర్జున రిలీజ్ డేట్ మళ్లీ కొత్తగా ప్రకటించారు. అక్టోబరు 30న వస్తామని డిక్లేర్ చేశారు. ఈ చిత్రానికి నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ఈ సినిమా అక్టోబరు 30నే వస్తుందని చెప్పారు. ఈసారి వాయిదా వేసే ప్రసక్తి లేదని, ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ చాలా రిలీజ్ చేశామని, ఇక వదలడానికి తమ దగ్గర కంటెంట్ కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు. దాంతో అక్టోబరు 30న 'ఇట్లు అర్జున' రావడం తథ్యం అనుకొన్నారు. అయితే మరోసారి ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం అడ్డు పడింది. అక్టోబరు 30న 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ప్రకటించారు. దాంతో.. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.
నవంబరు 6న కూడా బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ ఉంది. అదే రోజున 'రామాయణ' విడుదల కానుంది. రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా అది. స్టార్ కాస్ట్ పరంగా క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్. అలాంటి సినిమాపై పోటీ పడడం..ఇబ్బందికరమైన పరిణామమే. అక్టోబరు 30న రావాల్సిన మరో సినిమా 'సమ్మర్ హాలీడేస్' కూడా నవంబరు 6కి షిఫ్ట్ అయ్యింది. ఇదంతా ఆదర్శ కుటుంబం చలవే.

