Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నారా దేవాన్ష్  "డినో డీట్స్ "  పాడ్ కాస్ట్ !

నారా దేవాన్ష్ "డినో డీట్స్ " పాడ్ కాస్ట్ !

Telugu 360 1 week ago

నారా లోకేష్, బ్రాహ్మణిల కుమారుడు, నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం ఎనిమిదేళ్ల ప్రాయంలోనే డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెడుతూ దేవాన్ష్ ఒక సొంత పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించబోతున్నాడు.

ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సహా కుటుంబసభ్యులంతా సోషల్ మీడియాలో విషయాన్ని పోస్టు చేశారు.

నారా లోకేష్ తన ట్వీట్‌లో ఇంట్లో జరిగిన ఒక సరదా సంఘటనను పంచుకున్నారు. ఇల్లంతా అకస్మాత్తుగా డైనోసార్లతో నిండిపోయింది.. ఎక్కడ చూసినా డైనోసార్ పుస్తకాలు, డైనోసార్ పెయింటింగ్‌లు, బొమ్మలే కనిపిస్తున్నాయి. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు దేవాన్ష్ అసలు రహస్యాన్ని బయటపెట్టాడు అంటూ లోకేష్ రాసుకొచ్చారు. తన కుమారుడు డైనోసార్లపై ప్రత్యేకంగా డినో డీట్స్ అనే సరికొత్త పాడ్‌కాస్ట్‌ను తీసుకురాబోతున్నాడని ఆయన వెల్లడించారు.

చిన్నారి దేవాన్ష్‌కు చిన్నప్పటి నుంచి జంతుశాస్త్రం, ముఖ్యంగా కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన డైనోసార్ల చరిత్ర, వాటి జీవన విధానంపై విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ డినో డీట్స్ పాడ్‌కాస్ట్‌ ద్వారా దేవాన్ష్ తనే ఒక హోస్ట్‌గా మారి, డైనోసార్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, వింతలు, వాటి రకాలు , చారిత్రక విశేషాలను తనదైన శైలిలో ప్రపంచానికి వివరించబోతున్నాడు. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగనుందని తెలుస్తోంది.

ఈ క్రేజీ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ వారం శుక్రవారం విడుదల కాబోతోంది. నారా కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా దేవాన్ష్ ఇలా ఒక వినూత్నమైన మేధోపరమైన సృజనాత్మక ప్రాజెక్ట్‌తో ముందుకు రావడం నారా అభిమానుల్లో, నెటిజన్లలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. చిన్న వయసులోనే దేవాన్ష్ చూపిస్తున్న ఈ ప్రతిభకు, అన్వేషణా నైపుణ్యానికి సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360