తమిళ చిత్ర పరిశ్రమ లో ఆదివారం అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘట్టం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత, దర్శకుడు , నటుడు కే. రాజన్ చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన వయసు 85 ఏళ్లు. అడయార్ నది వంతెన పైనుంచి ఆయన నదిలోకి దూకడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, నదిలో గాలింపు చర్యలు చేపట్టి ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.
అసలు ఈ వృద్ధాప్యంలో ఆయన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే కోణంలో చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం.. కే. రాజన్ గత కొంతకాలంగా తన కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. 85 ఏళ్ల వయసులో ఒంటరితనం వేధించడం, దానికి తోడు కొన్ని వ్యక్తిగత , వృద్ధాప్య సమస్యల వల్ల ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు అనుమానిస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను, సన్నిహితులను విచారిస్తున్నారు.
తమిళ ఇండస్ట్రీలో కే. రాజన్ కేవలం ఒక నిర్మాతగానే కాకుండా అత్యంత ధైర్యశాలిగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నిక్కచ్చి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. 1983లో నటుడు సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన బ్రహ్మచారిగళ్ సినిమాతో ఆయన నిర్మాతగా ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా దర్శకత్వం వహించారు. అలాగే పలు చిత్రాల్లో నటుడిగా, రచయితగా కూడా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ప్రముఖ నిర్మాత ఐసరి కే. గణేష్‌కు ఈయన సోదరుడు.
ఇటీవలి కాలంలో వివిధ సినిమాల ఆడియో ఫంక్షన్లు, ప్రెస్ మీట్లలో చిత్ర పరిశ్రమలోని లోపాలను, నటీనటుల మితిమీరిన రెమ్యునరేషన్లను బహిరంగంగా విమర్శిస్తూ ఆయన నిరంతరం వార్తల్లో నిలిచారు. సినిమా ఈవెంట్లలో ఆయన మాట్లాడే బోల్డ్ స్టేట్‌మెంట్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. అంతటి ధైర్యవంతుడైన సీనియర్ సినీ పెద్ద.. ఇలా నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడటాన్ని ఇండస్ట్రీ వర్గాలు నమ్మలేకపోతున్నాయి. విశాల్, ఖుష్బూ సుందర్, ఆర్. శరత్‌కుమార్ వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

