Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నత్వానీ వదిలేస్తారా?

నత్వానీ వదిలేస్తారా?

Telugu 360 1 week ago

ఆంధ్రప్రదేశ్ కోటా నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమళ్ నత్వానీ పదవీ కాలం వచ్చే నెల జూన్ 21, 2026 నాటితో ముగియనుంది.

అంతకుముందు రెండుసార్లు జార్ఖండ్ నుండి రాజ్యసభకు వెళ్లిన ఆయన, 2020లో జగన్ మోహన్ రెడ్డి సహకారంతో ఏపీ కోటాలో పెద్దల సభలో అడుగుపెట్టారు. అయితే, ప్రస్తుత ఏపీ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం, ఖాళీ కాబోయే స్థానాలన్నీ కూటమి ఖాతాలోకి వెళ్లే పరిస్థితి ఉండటంతో నత్వానీ తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పరిమళ్ నత్వానీకి రిలయన్స్ ప్రతినిధిగా దేశంలోని అగ్రనేతలందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రిలయన్స్ పెట్టుబడుల విషయంలో నత్వానీ అమరావతికి వచ్చేవారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇక్కడి నుండి మళ్లీ సీటు సాధించడం ఆయనకు అంత సులువు కాదు. కూటమిలో ఇప్పటికే సీట్ల సర్దుబాటు, స్థానిక నేతల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, చంద్రబాబు పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఏపీ కోటా ఇవ్వడానికి మొగ్గు చూపకపోవచ్చని భావిస్తున్నారు. కానీ ఆయనకు ప్రత్యామ్నాయం లేకపోతే ముఖేష్ అంబానీ పట్టుబడితే చంద్రబాబు ఇవ్వాల్సి రావొచ్చు.

జార్ఖండ్‌లో ట్విస్ట్ - స్వతంత్రుడిగా బరిలోకి?

అయితే ఇక్కడ నత్వానీకి మరో ప్రత్యామ్నాయం ఉంది. నత్వానీకి మళ్లీ తన పాత అడ్డా అయిన జార్ఖండ్లో చాన్స్ కనిపిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని వాడుకుని, అక్కడ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లో ఉన్న బీజేపీ ,దాని మిత్రపక్షాల మద్దతుతో పాటు, అధికార పక్షంలోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లను చీల్చి అక్కడ సీటు దక్కించుకోవాలనే వ్యూహంతో ఆయన ఉన్నట్లు జార్ఖండ్ రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ఏపీకి నత్వానీ చేసింది జీరో

నత్వానీ ఏపీ నుంచి ఆరేళ్ల పాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ, రాష్ట్రానికి ఆయన చేసిన మేలు ఏమీ లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ కోటాలో సీటు పొంది, పార్లమెంట్‌లో గుజరాత్ పరిధిలోని గిర్ సింహాల రక్షణ గురించి, గుజరాత్ జాతీయ రహదారుల గురించి అడిగిన ప్రశ్నలే ఎక్కువని ఆయన పార్లమెంటరీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, కనీసం తన ఎంపీ లాడ్స్ నిధులను ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయడంలో కానీ ఆయన పూర్తిగా విఫలమయ్యారు.

ఏపీ కోటాను వదిలి సొంత గూటికి!

రాష్ట్ర ప్రజలతో ఎలాంటి సంబంధం లేని పారిశ్రామికవేత్తలను రాజకీయ అవసరాల కోసం ఏపీ కోటా నుంచి రాజ్యసభకు పంపే సంస్కృతికి స్వస్తి పలకాలని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. అటు నత్వానీ కూడా ఏపీలో తనకు మళ్లీ అవకాశం దక్కదని ముందే గ్రహించి, జార్ఖండ్ లేదా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. మొత్తం మీద, ఏపీ ఎంపీగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన నత్వానీ చాప్టర్, వచ్చే నెలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముగిసిపోనుందని స్పష్టమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360