Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవంబర్‌లో మళ్లీ విశాఖ సీఐఐ పెట్టుబడుల సదస్సు

నవంబర్‌లో మళ్లీ విశాఖ సీఐఐ పెట్టుబడుల సదస్సు

Telugu 360 1 week ago

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త, వినూత్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026ను నవంబర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సదస్సు నిర్వహణపై ఇప్పటికే ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ సారి పెట్టుబడుల సదస్సును కేవలం ఒకే నగరానికి పరిమితం చేయకుండా, గతానికి భిన్నంగా ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో ప్రధాన సదస్సు నిర్వహించడానికంటే ముందే.. రాష్ట్రంలోని ఐదు ప్రముఖ నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు సరికొత్త ప్రణాళికను ఖరారు చేశారు.

ముందస్తుగా ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు

ఈ వ్యూహం ప్రకారం.. విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు ఏర్పాటు కానున్నాయి. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల వికేంద్రీకరణ కేవలం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనేది ముఖ్యమంత్రి ప్రధాన సంకల్పం. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ముందే బేరీజు వేసుకుని, ఆయా రీజనల్ సదస్సుల్లోనే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఎంఓయూలు కుదుర్చుకునేలా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశ్రామిక సదస్సులను రీజనల్ స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వ కృషి ప్రజలకు నేరుగా అర్థమవడంతో పాటు.. స్థానిక యువత, విద్యార్థులు , జెన్ జీ భాగస్వామ్యం భారీగా పెరుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టార్టప్‌లకు ప్రాధాన్యం

పెట్టుబడుల సదస్సులు అంటే కేవలం కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, సంతకాలు పెట్టడం అనే పాత భావన మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే సంఖ్య కంటే.. అంతర్జాతీయ నిపుణుల ద్వారా 'నాలెడ్జ్ షేరింగ్' ఎంతవరకు జరిగిందనేదే అత్యంత ముఖ్యమన్నారు. ఈ సదస్సు వేదికగా సరికొత్త ఆలోచనలకు, సరికొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయం, ఉద్యానరంగం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీతో పాటు మానసిక ప్రశాంతతను ఇచ్చే 'స్ట్రెస్ ఫ్రీ వర్క్', ఆధ్యాత్మికత వంటి అంశాలపై పబ్లిక్ పాలసీ చర్చలు జరగాలని సూచించారు. భవిష్యత్ అంతా గ్లోబల్ లీడర్లదేనని స్పష్టం చేసిన సీఎం.. అమరావతిలో త్వరలోనే 'సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్'ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

పెట్టుబడుల సదస్సుకు దేశవిదేశాల్లో ప్రచారం

31వ భాగస్వామ్య సదస్సుకు దేశవిదేశాల్లో భారీగా ప్రచారం కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగానే జూలై నుండి సెప్టెంబర్ వరకు దేశంలోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో రోడ్ షోలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. అంతర్జాతీయ డెలిగేట్లు, ప్రముఖ యూనివర్సిటీల నిపుణులు, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాసి ఈ సదస్సుకు ఆహ్వానించనున్నారు. ఏపీలో ఉన్న అవకాశాల్ని ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్య సదస్సు జరగనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360