Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిజామాబాద్ సభలో కవిత కన్నీరు

నిజామాబాద్ సభలో కవిత కన్నీరు

Telugu 360 3 weeks ago

నిజామాబాద్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తాను ఏ తప్పు చేశానని ఢిల్లీలోని తీహార్ జైలులో నిర్బంధించారో యావత్ సమాజం ఆలోచించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ కోడలిగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజల పక్షాన పోరాడిన తనను కక్షపూరితంగానే జైలుకు పంపారని గుర్తు చేసుకున్నారు. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలు ఎన్ని రకాలుగా వేధించి, సతాయించినా తాను ఏనాడూ ధైర్యం కోల్పోలేదని, నిప్పులాంటి నిజాయితీ గల నిజామాబాద్ బిడ్డగా నిలబడ్డానని స్పష్టం చేశారు.

సొంత గడ్డపై కార్యకర్తలు, ప్రజలను చూసినప్పుడు సహజంగానే మనసు బరువెక్కి కన్నీళ్లు వచ్చాయని, అంతమాత్రాన తనను పిరికిదానిగా భావించవద్దని కవిత పేర్కొన్నారు. జైలు జీవితం వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఏనాడూ తన సిద్ధాంతాల నుంచి దారితప్పలేదని పునరుద్ఘాటించారు. రాజకీయాల్లో తాను చూడని ఉన్నత పదవులు లేవని, అనుభవించని అధికారం లేదని స్పష్టం చేసిన ఆమె.. ప్రజాసేవే పరమావధిగా తాను ముందుకు సాగానని గుర్తుచేశారు.

అయితే పార్టీ కోసమే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఒకప్పుడు చెప్పిన నాయకత్వం.. ఇప్పుడు ఏ కారణంతో తనను పార్టీ నుంచి దూరం పెట్టాలని చూస్తోందో సమాధానం చెప్పాలని కవిత సూటిగా ప్రశ్నించారు. ఇంతటి త్యాగాలు చేసిన తనను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని నిలదీశారు. క

తెలంగాణ కోసం ఇంకా చేయాల్సిన బాధ్యతలు, కర్తవ్యాలు ఉన్నందునే గట్టి పట్టుదలతో నిలబడ్డామని, కేవలం స్వార్థ పదవుల కోసమే రాజకీయాలు చేయలేదని కవిత స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి అడ్డంకులు, కుట్రలు ఎదురైనా ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల హక్కుల కోసం చివరివరకూ పోరాటం కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. కవిత చేసిన ఈ భావోద్వేగ ప్రసంగం, పార్టీ వైఖరిపై సంధించిన ప్రశ్నలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360