Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిన్న  వెలిగొండ.. రేపు ఉత్తరాంధ్రకు గోదావరి !

నిన్న వెలిగొండ.. రేపు ఉత్తరాంధ్రకు గోదావరి !

Telugu 360 2 weeks ago

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదవుతోంది. దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రికార్డు వేగంతో ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తోంది.

మొన్న రాయలసీమకు కృష్ణా జలాలను తరలించడం, నిన్న ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించడమే కాకుండా.. ఇప్పుడు ఒక్క రోజు వ్యవధిలోనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి పునాదిగా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించే చారిత్రాత్మక ఘట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

బుధవారం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుని సమీపంలోని నర్సీపట్నం రహదారిపై పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నిర్మించిన అక్విడెక్టు వద్ద పవిత్ర గోదావరి నదికి ఘనంగా జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం అక్విడెక్టు గేట్లను ఎత్తి గోదావరి జలాలను అధికారికంగా ఉత్తరాంధ్ర దిశగా విడుదల చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్‌హౌస్ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి ఎత్తిపోసిన నీరు కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరనుంది. ఈ కీలక అడుగుతో దశాబ్దాలుగా ఉత్తరాంధ్రవాసులు కంటున్న సుజల స్రవంతి కల సాకారమవుతోంది.

గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకోవడం ద్వారా తొలిదశలోనే దాదాపు 110 చెరువులు నిండటంతో పాటు 1.48 లక్షల ఎకరాలకు నేరుగా సాగునీరు అందనుంది. అంతేకాకుండా ఏలేరు ఆయకట్టు స్థిరీకరణతో కలిపి మొత్తంగా 2.87 లక్షల ఎకరాల భూములకు సాగునీటి ధీమా లభించనుంది. దీనితో పాటు 143 గ్రామాలకు చెందిన 4.23 లక్షల మంది ప్రజల తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం దక్కబోతోంది. తదుపరి దశల్లో ఈ జలాలను విశాఖపట్నంలోని మేఘాద్రిగెడ్డకు, అక్కడ నుంచి విజయనగరం జిల్లా గడిగెడ్డ వరకు తరలించేలా వేగవంతమైన ప్రణాళికను సిద్ధం చేశారు.

రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి జలభద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. హంద్రీ-నీవా విస్తరణను వంద రోజుల్లో ముగించి సీమకు, నిన్న వెలిగొండ ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు, ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని పారిస్తూ సీఎం చంద్రబాబు జల సంకల్పాన్ని నిజం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360