Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నొప్పి తెలియకుండా పెట్రో బాదుడు !

నొప్పి తెలియకుండా పెట్రో బాదుడు !

Telugu 360 5 days ago

పెట్రో ధరల్ని మరో 90 పైసలు పెంచారు. మూడు రూపాయలు పెంచి మూడు రోజులు కాక ముందే ఈ పెంపు జరిగింది. అంటే ఇంధన ధరల నియంత్రణ, పన్నుల విధింపు విధానంలో చమురు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు సామాన్య పౌరులకు నొప్పి తెలియకుండా భారం వేస్తున్నాయన్నమాట.

ఒకే సారి మూడు రూపాయల మేర పెంచినప్పుడు.. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ దృష్ట్యా ఆ మాత్రం పెరుగుదల సహజమేనని ప్రజలు సర్దుకుపోయారు. అయితే, ఈ తాత్కాలిక సంతోషం లేదా ఉపశమనం వెనుక వినియోగదారులకు తెలియకుండానే జేబులకు చిల్లు పెట్టేలా ఒక దీర్ఘకాలిక మైక్రో ప్రైసింగ్ వ్యూహం అమలు చేస్తున్నారు.

పైసల్లో పెంపు - మైక్రో ప్రైసింగ్ వ్యూహం

గతంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పుడు దేశీయంగా లీటరుకు 20 పైసలు లేదా 30 పైసల చొప్పున రోజూవారీ మార్పులు చేసేవారు. ఆ విధానం వల్ల ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఆ మైక్రో మేనేజ్‌మెంట్‌ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. ఒకేసారి ఐదారు రూపాయలు పెంచితే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమై రాజకీయంగా నష్టం జరుగుతుంది కాబట్టి, దానికి భిన్నంగా వారానికో రూపాయి చొప్పున క్రమంగా పెంచుకుంటూ పోయే సరికొత్త వ్యూహాన్ని చమురు సంస్థలు తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా మరో 90 పైసలు పెంచడమే దీనికి సాక్ష్యం.

ధరలు భారీగా తగ్గినప్పుడు లాభం కంపెనీలు, ప్రభుత్వానివే

ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నుంచి వచ్చే ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పన్నుల విధానం కూడా వారికే అనుకూలంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర తగ్గినప్పుడు ఎక్సైజ్ సుంకం, అదనపు సెస్సుల రూపంలో కేంద్రం తన ఖజానాను నింపుకుంది. ఆ లాభాన్ని ప్రజలకు చేరనివ్వ లేదు. ఈ రకమైన పన్నుల మేనేజ్‌మెంట్ విధానం వల్ల ఇంధన ధరలు ఎప్పుడూ ఒక నిర్దేశిత గరిష్ట స్థాయిలోనే స్థిరపడిపోయాయి. ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా.. పడే భారం అంతా మెల్లగా ప్రజలపై వేస్తున్నారు.

ద్రవ్యోల్బణాన్ని పెంచనున్న పెట్రో బాదుడు

పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం రవాణా రంగానికే పరిమితం కావు; వీటి పెంపు అనేది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. వారానికో రూపాయి చొప్పున పెరిగే క్రమం నెల తిరిగేసరికి నాలుగు రూపాయల భారంగా మారుతుంది. పాలకుల ఈ వ్యూహాత్మక పన్నుల పెంపు విధానాన్ని అర్థం చేసుకునేలోపే సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360