Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓ పాస్టర్ దాడి నాటకం - కానీ అట్టర్ ఫ్లాప్ !

ఓ పాస్టర్ దాడి నాటకం - కానీ అట్టర్ ఫ్లాప్ !

Telugu 360 5 days ago

ల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవీ ప్రాంతంలో పాస్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఘటన ఒక పెద్ద ప్లాన్డ్ డ్రామా గా తేలింది.

జీకే వీధి మండలం చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు ఒక కారుపై రాళ్లతో దాడి చేస్తున్నట్లు, పాస్టర్‌ను చంపేందుకు ప్రయత్నించినట్లు ఉన్న వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. అయితే, ఈ ఘటనపై స్వయంగా అల్లూరి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే అసలు నిజాన్ని నిరూపించి, ఇదంతా ఒక కట్టుకథ అని తేల్చేసింది.

పోలీసుల దర్యాప్తులో భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే కడపకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్ తన అనుచరులతో కలిసి ఈ అటాక్ డ్రామా ఆడినట్లు పక్కా ఆధారాలతో బట్టబయలైంది. పాడేరు వెళ్లే మారుమూల అటవీ ప్రాంతంలో తమపై తామే దాడి చేయించుకుని, హత్యాయత్నం జరిగినట్లు నటించారని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరి భార్యకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతా, ఇన్‌స్టాగ్రామ్ ఆడియోలు, వీడియో మెసేజ్‌లను పోలీసులు లోతుగా పరిశీలించగా.. ఎక్కడ దాడి చేయాలి? ఎలా దాడి చేయాలి? సీన్ ఎలా క్రియేట్ చేయాలి? అనే విషయాలపై వీరంతా ముందుగానే ప్లాన్ చేసుకున్న ఆడియో సంభాషణలు దొరకడంతో నిందితుల గుట్టు రట్టయింది.

ఈ ఘటనలో పాస్టర్‌కు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోయినప్పటికీ, కేవలం సానుభూతి కోసం, పబ్లిసిటీ కోసం చిన్న గాయం చేసుకుని పెద్ద ఎత్తున హత్యాయత్నం డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే వైద్యాధికారుల నివేదికలు కూడా ఈ డ్రామాను ధ్రువీకరించాయి. ఈ కుట్రకు సంబంధించి కారులో వచ్చిన ముగ్గురితో పాటు, దాడి చేసినట్లు నటించిన మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం డ్రామా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు.. ఎందుకీ డ్రామా చేయాల్సి వచ్చిందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సమాజంలో లేనిపోని అపోహలు సృష్టించేలా, వివిధ మతాల మధ్య వైషమ్యాలు, ఉద్రిక్తతలు పెంచేలా ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కల్పిత దాడుల డ్రామాలకు తెరతీసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని తప్పుడు వీడియోలు సర్క్యులేట్ చేసిన పాస్టర్ అభినయ్ దర్శన్ బృందంపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360