Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాపం దేవినేని అవినాష్ .. !

పాపం దేవినేని అవినాష్ .. !

Telugu 360 1 week ago

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తోంది. పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను బరిలోకి దించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు తాడేపల్లి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా ప్రభావానికి దీటైన అభ్యర్థిగా దేవినేని నెహ్రూ వారసుడైన అవినాష్ అయితేనే సరైన పోటీ ఇవ్వగలరని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే.. పార్టీలో బకరా దొరక్క అవినాష్‌ను మళ్లీ బలిపీఠం ఎక్కించేందుకే జగన్ ఈ ఎత్తుగడ వేశారని సులువుగా అర్థం చేసుకోవచ్చు.

ఒక్క సారీ గెలవలకేపోయిన అవినాష్

దేవినేని అవినాష్ రాజకీయ ట్రాక్ రికార్డును నిశితంగా గమనిస్తే.. ఇప్పటివరకు ఆయన ఖాతాలో ఒక్క ప్రత్యక్ష ఎన్నికల విజయం కూడా లేదు. 2014లో సమైక్యాంధ్ర పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా, 2019లో టీడీపీ తరఫున గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నానిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం జగన్ పంచన చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటికీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ చేతిలో దాదాపు 50 వేల పైచిలుకు ఓట్ల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి, తిరుగులేని ప్రజాదరణ పొందిన దివంగత నేత దేవినేని నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని, ఆయన సంపాదించిన బ్రాండ్ ఇమేజ్‌ను పూర్తిగా అటకెక్కించేసి.. చివరకు జగన్ కోసం విజయవాడలో ఓ వంద మంది కార్యకర్తలను పోగేసి రోడ్లపై హల్చల్ చేసే స్థాయి లీడర్‌గా మాత్రమే అవినాష్ మిగిలిపోయారు.

ఇప్పటికే జగన్ ట్రాప్‌లో చిక్కుకుని సర్వనాశనం

ఇప్పటికే జగన్ విసిరిన రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని అవినాష్ జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ఆదేశాలతో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, పట్టాభి ఇంటిపై దాడి ఘటనలు సహా పలు వివాదాల్లో చిక్కుకుని క్రిమినల్ కేసులను, జైలు భయాన్ని నెత్తినెత్తుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సొంత నియోజకవర్గంలో ప్రజల మనసులు గెలవలేకపోయిన అవినాష్.. కూటమి ప్రభంజనం బలంగా వీస్తున్న ప్రస్తుత తరుణంలో నేరుగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగితే దక్కేది ఘోర అవమానమేన . గతంలో లాగా కార్పొరేటర్లు ఎన్నుకునే పరోక్ష పద్ధతి కాకుండా.. ప్రస్తుతం నగర ప్రజలంతా ఓటేసే ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో, ఏకంగా లక్షలాది మంది ఓటర్ల తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది.

భారీ తేడాతో ఓడిపోతే పరువు గోవిందా !

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒత్తిడికి తలొగ్గి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. ఇప్పటికే ఉన్న కొద్దిపాటి పరువు కూడా గంగలో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నగరం నడిబొడ్డున భారీ ఓట్ల తేడాతో మరో పరాజయం మూటగట్టుకుంటే.. ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా పాతాళానికి పడిపోవడమే కాకుండా, దేవినేని నెహ్రూ కుటుంబానికి ఉన్న మిగిలిన ప్రతిష్ట కూడా నామరూపాలు లేకుండా పోయే ప్రమాదముంది. తాడేపల్లి నుంచి ఎలాంటి ఆర్థిక దన్ను లేకపోయినా, కేవలం జగన్ మాటలు నమ్మి మరోసారి రాజకీయ ఆత్మహత్యకు సిద్ధపడితే.. రాజకీయాల్లో కోలుకోలేని శాశ్వత ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అవినాష్ శ్రేయోభిలాషులే గుసగుసలాడుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360