రాష్ట్రంలో ఒక భారీ ప్రాజెక్టు ప్రారంభమైనా, గ్లోబల్ దిగ్గజ సంస్థల నుంచి వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంటూ ఒక వర్గం గగ్గోలు పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కామన్‌గా మారింది.
రాష్ట్రానికి పాలనాధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి చేసే ప్రతి అధికారిక పని, తీసుకునే నిర్ణయం సహజంగానే ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఫలితాలు సాధిస్తున్న ఒక నాయకుడికి మీడియా ప్రాధాన్యత ఇవ్వడం పత్రికా ధర్మం తప్ప, దాన్ని వ్యక్తిగత డబ్బాగా చిత్రీకరించడం వెనుక రాజకీయ అసూయ తప్ప మరేమీ కనిపించడం లేదు.
పబ్లిసిటీ అంటే ఐదేళ్లలో జగన్ చేయించుకున్నది!
రాజకీయాల్లో పబ్లిసిటీ అనే పదానికి అర్థాన్ని వక్రీకరించి వాడుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనను గమనిస్తే.. తాడేపల్లి ప్యాలెస్‌ను దాటి బయటకు రాకుండా, సెక్రటేరియట్‌కు కూడా వెళ్లకుండా గడిపిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నపాటి బటన్ నొక్కుడు కార్యక్రమానికి కూడా సొంత మీడియా, సోషల్ మీడియా వేదికగా పతాక శీర్షికలతో పేజీలకు పేజీలు ప్రచారం కల్పించినప్పుడు అది ఎవరికీ పబ్లిసిటీ గా అనిపించలేదు. రోజంతా టీవీ ఛానళ్లలో భజన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కనిపించని తప్పు.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అహర్నిశలు శ్రమిస్తూ ఫలితాలు చూపిస్తున్న నేతపైకి వచ్చేసరికి పబ్లిసిటీ స్టంట్ గా మారడం విచిత్రం అనుకోవచ్చు.
కార్యక్రమ ప్రాధాన్యతను బట్టి ప్రచారం
తాజాగా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు విడుదల కావడం అనేది ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం. నల్లమల కొండలను చీల్చుకుంటూ సొరంగం నుంచి కృష్ణమ్మ ప్రాజెక్టులోకి ప్రవేశించడం ఆంధ్రప్రదేశ్ సాగునీటి చరిత్రలోనే ఒక మైలురాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న చారిత్రక ఘట్టాన్ని మీడియా లైవ్ కవరేజీల ద్వారా ప్రజలకు చూపించడం, ప్రముఖంగా ప్రచురించడం సహజమైన సమాచార ప్రసార బాధ్యత. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి, కష్టసాధ్యమైన పనులను సమన్వయం చేసి నీటిని విడుదల చేసిన సందర్భంలో ఆ కృషిని చూపించడాన్ని కూడా పబ్లిసిటీ పిచ్చి అనడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనం.
పని చేసే నాయకుడికి వచ్చే గుర్తింపే పబ్లిసిటీ
అదేవిధంగా పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెట్టుబడుల రాక కూడా గాల్లోంచి ఊడిపడేది కాదు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి రావాలంటే నాయకుడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయత, అనుకూల పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతుల కల్పనపై ఇచ్చే భరోసా ముఖ్యం. నిరంతరం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి వేల కోట్ల ప్రాజెక్టులను రప్పిస్తున్నప్పుడు, ఆ వార్తలను పతాక శీర్షికల్లో ప్రచురించడం రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు సానుకూల సంకేతం. చేసే పనిని ప్రజలకు తెలియజేయడం పారదర్శకత అవుతుంది తప్ప, కృత్రిమ కాదు. ఏమీ చేయకుండా కేవలం తెరవెనుక ఉండి పత్రికలు, సోషల్ మీడియాతో మైలేజ్ పొందాలనుకోవడం ఒక పంథా అయితే.. క్షేత్రస్థాయిలో నిలబడి శ్రమిస్తూ, అభివృద్ధిని సాకారం చేసి ప్రజల మన్ననలు పొందడం మరొక పంథా. చేసే పనిలో చిత్తశుద్ధి, కనిపించే ఫలితాలు ఉన్నంత కాలం ప్రజలు వాస్తవాలను గుర్తిస్తారు తప్ప, ఇలాంటి అసత్య ప్రచారాలను ఏమాత్రం పట్టించుకోరు.

