తెలంగాణ రక్షణ సేన పేరుతో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కవిత.. తెలంగాణ వ్యాప్తంగా తన పార్టీ ఉనికి కనిపించేలా వినూత్నమైన వ్యూహం పన్నారు. ఎక్కడ చూసినా తన పార్టీ జెండా గద్దెలు ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తన అధికారిక జెండా గద్దె నమూనాను హైదరాబాద్‌లో కవిత ఆవిష్కరించారు . పార్టీ కోర్ కలర్‌గా పసుపు రంగును ఎంచుకున్న ఈ సరికొత్త మోడల్‌ను పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ జెండా గద్దె నమూనాను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఒకే రకమైన ప్రమాణాలతో కూడిన జెండా గద్దెలను నిర్మించనున్నట్లు కవిత ప్రకటించారు. పార్టీ జెండా ఎగురవేసే ప్రతి చోటా ఒకే విధమైన కలర్ కోడింగ్, నిర్దేశిత డిజైన్‌ను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. దీనివల్ల పార్టీకి క్షేత్రస్థాయిలో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్, ఏకరూపత వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సరికొత్త నిర్మాణ శైలిని ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వీలుగా మే 20వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ ర్వహిస్తున్నట్లు కవిత వెల్లడించారు. ఈ నెల రోజుల పాటు ప్రతి ఊరిలోనూ పార్టీ జెండాలను పండుగ వాతావరణంలో ఆవిష్కరిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్తామని వివరించారు.
సరికొత్త వ్యూహాలతో, ఆకర్షణీయమైన రంగులతో తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఉనికిని చాటుకునేందుకు తెలంగాణ రక్షణ సేన వేస్తున్న ఈ అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ జెండా పండుగ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయడంతో పాటు, పసుపు రంగు జెండాతో తెలంగాణ నలుమూలలా ఒక బలమైన ముద్ర వేయాలని నాయకత్వం భావిస్తోంది. పసుపు రంగుకు ఓ ప్రత్యేకమైన పాజిటివ్ వైబ్ ఉంటుంది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ గా లేని సమయంలో పసుపు రంగుతో కవిత ప్రజల్లోకి వెళ్లాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.

