ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ముసుగులో కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రలకు తెరలేపినట్లుగా మరోసారి స్పష్టమయింది.
ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ప్రభుత్వ భూమిని తప్పుడు, నకిలీ జీవోల సాయంతో కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారని పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇంతటి భారీ భూకుంభకోణం వెలుగుచూసినా, పవన్ కల్యాణ్‌పై నిత్యం విమర్శలు గుప్పించే నాయకులు గానీ, సోషల్ మీడియా వర్గాలు గానీ దీనిపై నోరు మెదపలేదు.
పైగా పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొందరు యూట్యూబర్లు కొత్త ప్రచారానికి తెరలేపారు. పవన్ కల్యాణ్‌కు చెందిన ఫామ్‌హౌస్ వివరాలను ఇంటర్నెట్ నుంచి సేకరించి.. అది చెరువు పట్టా, శిఖం భూమి అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. చట్ట ప్రకారం శిఖం పరిధిలోకి వచ్చే పట్టా భూముల్లో శాశ్వత సిమెంట్ నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, అక్కడ వ్యవసాయం లేదా తోటల పెంపకం వంటి పనులు చేసుకోవడానికి చట్టబద్ధంగా ఎలాంటి అభ్యంతరం లేదు. పవన్ కల్యాణ్ కూడా అక్కడ చట్టపరిధిలోనే వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ, ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్లుగా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.
ఈ అక్రమ, తప్పుడు ప్రచారాలపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్‌పై ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సదరు యూట్యూబర్లపై ఒక సీనియర్ న్యాయవాది పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో ఒక ఉపముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని బట్టి పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక, ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఆయనపై బురదజల్లేందుకు ఒక వర్గం ఎంతగా ప్రయత్నిస్తోందో స్పష్టమవుతోంది.
ఈ వివాదాల వెనుక తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వ్యూహం దాగి ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపి నేతల భారీ భూదందాలపై కనీసం మాట్లాడని వారు.. కేవలం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం కోసమే తెలంగాణ ముసుగు వేసుకుని ఇలాంటి విమర్శలు చేస్తున్నారని జనసేన మరియు కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి.

