ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో గత పదేళ్లుగా ఒక వింత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. జీవితంలో కనీస స్థాయి విజయం లేదా పది పైసల యోగ్యత లేని వారు కూడా రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించాలంటే ఎంచుకుంటున్న ఏకైక మార్గం..
పవన్ కళ్యాణ్ . కత్తి మహేష్ అనే వ్యక్తి విమర్శల దగ్గర నుండి ప్రారంభమై, మొన్నటి ఎన్నికల ముందు వరకు సాగిన శ్రీరెడ్డి పరుష పదజాలం, పోసాని కృష్ణమురళి ఆవేశపూరిత వ్యాఖ్యలు, ఆర్‌జీవీ తీసిన పేరడీ సినిమాలు.. ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్‌ను ఒక సాఫ్ట్ టార్గెట్ లా మార్చుకుని తమ పబ్బం గడుపుకున్నారు. తాజాగా ఏలూరు దళిత క్రైస్తవుల సభలో సీఎం, డిప్యూటీ సీఎంలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం వరుస కేసులతో కటకటాలపాలైన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వరకు ఇదే సూత్రాన్ని నమ్ముకుని రాజకీయం చేశారు.
పవన్ పై రాళ్లేసి గొప్పోళ్లు అయిపోదామనుకున్నారు!
అసలు ఎవరికీ ఎలాంటి హాని చేయని, ఎల్లప్పుడూ సమాజం కోసమే పరితపించే పవన్ కళ్యాణ్ ఈ స్థాయి పబ్లిసిటీ స్టంట్స్‌కు ఎందుకు వేదికయ్యారు? అనే ప్రశ్న వేసుకుంటే.. దీని వెనుక ప్రధానంగా మీడియా , సోషల్ మీడియా నడిపిన వ్యాపార కోణం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే చాలు ఛానళ్లకు టీఆర్‌పీ లు, యూట్యూబ్ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయని గ్రహించిన కొందరు.. ఉద్దేశపూర్వకంగానే నిలకడలేని వ్యక్తులకు వేదికలు కల్పించారు. కనీస నైతిక విలువలు లేకుండా పవన్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పుస్తకాలు రాసి, అసత్య ఆరోపణలు చేసినా మీడియా వాటిని గంటల తరబడి లైవ్ డిబేట్లలో ప్రసారం చేసింది. ఈ క్రమంలో ఒక సున్నిత మనస్కుడైన నాయకుడు, ఒక సాధారణ మనిషిగా పవన్ కళ్యాణ్ పడిన అంతర్గత వేదనను, మానసిక క్షోభను ఆయా శక్తులు తమ స్వార్థం కోసం పూర్తిగా విస్మరించాయి.
సహనం నశిస్తే దెబ్బ ఎలా ఉంటుందో..
పవన్ కళ్యాణ్ సమాజ హితం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సహనాన్ని చేతకానితనంగా భావించి, పదే పదే ఆయనపై బురద చల్లి తాము గొప్పవాళ్లం అయిపోవాలని చూసిన వారికి ఇప్పుడు కాలం చెల్లింది. పవన్ కళ్యాణ్ కేవలం అవతలి వారు వచ్చి కొట్టిపోవడానికి ఒక పంచింగ్ బ్యాగ్ కాదనే నిజాన్ని ఈ శక్తులు గుర్తించలేకపోయాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఏదైనా వన్ వే లాగా సాగదనే ప్రకృతి నియమం ఇప్పుడు ఏపీలో అక్షరాలా అమలవుతోంది. గతంలో పవన్‌ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందిన వారంతా నేడు ప్రజా తీర్పుతో తెరమరుగైపోగా.. పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా, అత్యంత శక్తివంతమైన ప్రజా నాయకుడిగా అవతరించారు. ఇప్పుడు సోషల్ మీడియా దుర్వినియోగానికి, విద్వేషపూరిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేక విచారణా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.
అందరికీ ఇచ్చి పడేస్తారు..తీసుకోవాల్సిందే !
ఇప్పుడు ఇలాంటి తప్పుడు నరేటివ్‌లు నడిపిన ప్రతి ఒక్కరికీ చట్టబద్ధంగా ఇచ్చి పడేసే సమయం వచ్చింది. ఒక కేసులో బెయిల్ రాగానే మరో పాత కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం, న్యాయస్థానాలు సైతం సమాజంలో విద్వేషాలు రగిల్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం చూస్తుంటే.. వ్యవస్థలు ఎంత పటిష్టంగా పని చేస్తున్నాయో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్‌ను దూషించి బతికిన వారంతా ఇప్పుడు చట్టం తిరిగి కొడుతున్న దెబ్బలకు తాళలేక, విచారణకు సహకరించకుండా భయపడుతున్నారు. చేతకాని సన్నాసుల్లా ఇప్పుడు ఏడుపులు లంఘించుకోవడం మానేసి.. తాము గతంలో సమాజంపై, ఒక వ్యక్తిపై చల్లిన విషానికి ప్రతిఫలంగా చట్టపరమైన పరిణామాలను అనుభవించడానికి సిద్ధమవ్వాల్సిందే.

