'పెద్ది' ట్రైలర్ నిన్ననే వచ్చింది. రామ్ చరణ్ క్యారెక్టర్‌కి బుచ్చిబాబు ఇచ్చిన ఎలివేషన్లు బాగా పండాయి. క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ ఎలా ఉండబోతోందో ట్రైలర్ లో రుచి చూపించాడు బుచ్చిబాబు.
ఈ సినిమా విడుదలకు ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఈలోగా మరో రెండు పాటలు వస్తాయి. దాంతో పాటు రిలీజ్ ట్రైలర్ కూడా వదిలే ఆలోచనలో ఉంది చిత్రబృందం. 'పెద్ది' ట్రైలర్ కోసం 3 వెర్షన్లు కట్ చేశారు. అందులో ఒకటి ఫైనల్ చేసి రిలీజ్ చేశారు. ఇంకా రెండున్నాయి. వాటిలో ఒకటి రిలీజ్ కు ముందు విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జూన్ 4న 'పెద్ది' విడుదల కాబోతోంది. 3న ప్రీమియర్లు ఉంటాయి. జూన్ 1న గానీ, లేదంటే ప్రీ రిలీజ్ వేడుకలో గానీ రిలీజ్ ట్రైలర్ బయటకు వదులుతారు.
'పెద్ది' కి వచ్చిన బజ్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా హాట్ హాట్ గా సాగుతుందని తెలుస్తోంది. దాదాపుగా అన్ని ఏరియయాలూ క్లోజ్ అయిపోయినట్టే. 'పుష్ప 2' కంటే ఎక్కువ రేట్లు ఇచ్చి `పెద్ది` సినిమాని కొంటున్నారు. `పెద్ది` బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 'పుష్ప 2' రికార్డులన్నీ బద్దలు కొట్టాల్సిందే. ఈసారి చిత్రబృందం నార్త్ ప్రమోషన్లపై గట్టిగా దృష్టి సారించింది. ట్రైలర్ కూడా ముంబైలో రిలీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా పలు ఈవెంట్లు నిర్వహిస్తారు. ప్రతీ ఈవెంట్ కీ రామ్ చరణ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రమోషన్లతో 'పెద్ది'కి నార్త్ లో మంచి బజ్ క్రియేట్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.

