Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్దిరెడ్డి ప్రత్యర్థిని మార్చిన టీడీపీ !

పెద్దిరెడ్డి ప్రత్యర్థిని మార్చిన టీడీపీ !

Telugu 360 2 weeks ago

వైఎస్సార్ జిల్లా చిత్తూరు జిల్లా రాజకీయంలో అత్యంత కీలకమైన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి చల్లా రామచంద్రారెడ్డిని తప్పిస్తూ, నూతన ఇన్‌చార్జిగా మధుసూదన్‌నాయుడిని టీడీపీ అధిష్ఠానం నియమించింది.

ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధికారిక ప్రకటన జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంచుకోటగా ఉన్న పుంగనూరులో చల్లా బాబు సుదీర్ఘకాలంగా పోరాటం చేసినప్పటికీ, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మార్పునకు దారితీశాయి.

గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి వర్గానికి వ్యతిరేకంగా చల్లా బాబు తీవ్రస్థాయిలోనే పోరాటం చేశారని పేరున్నప్పటికీ, నియోజకవర్గంలో ఆయన శైలిపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్థానిక నేతలను సమన్వయం చేసుకోవడంలో విఫలమవడం, కొన్ని ఆరోపణలు చుట్టుముట్టడం , ప్రత్యర్థి వర్గాలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడంతో నియోజకవర్గంలో పార్టీ గ్రాఫ్ ప్రభావితమైందనే భావనకు నాయకత్వం వచ్చింది. ఈ క్రమంలోనే పీలేరు, పలమనేరు ఎమ్మెల్యేలతో పాటు అధిష్ఠానానికి అందిన నివేదికల ఆధారంగా మార్పు అనివార్యమైంది.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తిరుపతి హోటల్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశం రెండు వర్గాల ఘర్షణకు దారితీసింది. చల్లా బాబు వర్గీయులు, మధుసూదన్ నాయుడు మద్దతుదారుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ, భౌతిక దాడుల వరకు వెళ్లడంతో సమావేశం రద్దయింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు.. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు పాత నాయకత్వాన్ని పక్కనబెట్టి కొత్త రక్తాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.

నూతన ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్‌నాయుడు సోమల మండలం మేటిమందకు చెందిన నాయకుడు కాగా, మంత్రి నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన యువ నేతగా గుర్తింపు పొందారు. మధుసూదన్ నియామకంతో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో సంబరాలు జరుపుకోగా, చల్లా బాబు వర్గం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. రాబోయే రోజుల్లో పుంగనూరులో పార్టీని ఏకం చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాన్ని ఢీకొట్టడం నూతన ఇన్‌చార్జి మధుసూదన్‌కు అతిపెద్ద సవాలుగా మారనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360