శుక్రవారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల మేర పెరిగాయి. నాలుగు ఏళ్ల తర్వాత జరిగిన ఈ భారీ పెంపు సామాన్యుడికి షాక్ ఇచ్చినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం ఇంత తక్కువ పెంచారేమిటి అని ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటేశాయి. చమురు సంస్థలు ప్రతిరోజూ దాదాపు రూ. 1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని, ఆ నష్టాన్ని పూడ్చాలంటే లీటరుకు కనీసం రూ. 15 నుంచి రూ. 20 వరకు పెంచాల్సి ఉంటుందని అంచనా.
అసలు ముప్పు ముందు
ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి దాదాపుగా మూతపడింది. ప్రపంచ చమురు అవసరాల్లో 20 శాతం ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో సగానికి పైగా ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ మార్గం మూతపడటంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే సరఫరా నిలిచిపోవడం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
పొరుగు దేశాల్లో ఇంధన కటకట
పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్ మాత్రమే కాకుండా.. వియత్నాం వంటి దేశాల్లో కూడా ఇప్పటికే ఇంధన రేషనింగ్ మొదలైంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. భారత్‌లో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే ఇక్కడ కూడా ఇంధన వినియోగంపై ఆంక్షలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రధాని మోదీ ఇప్పటికే పొదుపు మంత్రాన్ని పఠించాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మరిన్ని వాతలు తప్పవా?
చమురు మార్కెటింగ్ సంస్థలు గత రెండు నెలలుగా నష్టాలను భరిస్తూ ధరలను స్థిరంగా ఉంచాయి. కానీ, ఇప్పుడు ఆ నష్టాలు భరించలేని స్థాయికి చేరుకున్నాయి. ఐసీఆర్ఏ వంటి రేటింగ్ ఏజెన్సీల ప్రకారం.. ఈ రూ. 3 పెంపు అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ముడి చమురు ధరలు గనుక 115 డాలర్ల పైనే కొనసాగితే, రాబోయే వారాల్లో విడతల వారీగా ధరలను పెంచక తప్పదు. అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు పెట్రోల్ రేట్ల విషయంలో సామాన్యుడికి మరిన్ని కష్టాలు తప్పవు.

