Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిఠాపురం రూపం మారుతోంది!

పిఠాపురం రూపం మారుతోంది!

Telugu 360 2 weeks ago

ధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పిఠాపురం పట్టణం ఇప్పుడు అభివృద్ధి బాట పట్టింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది.

ముఖ్యంగా దేశంలోని 18 శక్తి పీఠాలలో ఒకటైన పురూహూతికా దేవి క్షేత్రం , దత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం కావడంతో, ఇక్కడికి భక్తుల రద్దీ నిరంతరం ఉంటుంది.

ఆధునికంగా రైల్వేస్టేషన్ నిర్మాణం

ప్రయాణికుల సౌకర్యార్థం స్థానిక రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రూ.37.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మహారాష్ట్ర నుండి శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే మరాఠా భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భక్తుల ఇబ్బందులను గుర్తించిన పవన్ కళ్యాణ్, కేంద్ర రైల్వే శాఖతో సంప్రదింపులు జరిపి ఈ నిధులను మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులతో స్టేషన్ ప్లాట్‌ఫారాల విస్తరణ, అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, తాగునీరు, మెరుగైన లైటింగ్ , ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని కూడా పిఠాపురం ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు.

కీలక రైళ్లకు స్టాప్

రైలు స్టాపేజీల విషయంలో కూడా పిఠాపురానికి శుభవార్తలు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు ఇప్పటికే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ , నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లను పిఠాపురంలో నిలిపేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. దీనివల్ల ముంబై , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు నేరుగా పిఠాపురం చేరుకునే వెసులుబాటు కలిగింది. గతంలో సామర్లకోట లేదా కాకినాడలో దిగి రావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోనుంది.

త్వరలో మరికొన్ని కీలక నిర్ణయాలు

కేవలం ఆధ్యాత్మిక భక్తులే కాకుండా, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికుల సౌకర్యార్థం జన్మభూమి వంటి మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ఇక్కడ నిలపాలనే డిమాండ్ బలంగా ఉంది. దీనిపై కూడా ఉప ముఖ్యమంత్రి దృష్టి సారించి రైల్వే బోర్డుతో చర్చిస్తున్నారు. మొత్తంమీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక మోడల్ స్టేషన్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ మార్పులు స్థానిక రియల్ ఎస్టేట్ , పర్యాటక రంగాలకు కూడా ఊతాన్ని ఇస్తాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360