లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాల్లో ఒక తీరని వేదనగా, అంతకు మించి ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది.
ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ప్రస్తుతం చుక్క నీరు కూడా నిలిపే పరిస్థితి లేదు. నీళ్లు నిలిపితే పునాదులు కుంగిన ఆ నిర్మాణాలు పూర్తిగా కొట్టుకుపోతాయనేది పచ్చి నిజం. ఇంతటి భారీ వ్యయంతో కూడిన వైఫల్యాన్ని, లూప్‌హోల్స్‌ను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి ఏటా సరికొత్త రాజకీయ ప్రదర్శనలకు తెరలేపుతున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి కన్నెపల్లి వరకు కార్యకర్తల బలప్రదర్శనలతో పర్యటనలు చేస్తూ.. పోలీసులు తమను ఊరూరా అడ్డుకున్నారంటూ కలరింగ్ ఇచ్చుకోవడం ఈ పాలిటిక్స్‌లో భాగమే.
అయితే, కేటీఆర్ ఈ పర్యటనలో అసలు సమస్య ఉన్న మేడిగడ్డ వైపు కన్నెత్తి చూడకుండా, పక్కనే ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు వెళ్లి మోటార్లు ఆన్ చేయాలంటూ హడావుడి చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అక్కడ నీళ్లు నిలబెడితే డ్యాములు కొట్టుకుపోతాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నా.. తామేదో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అద్భుతం చేశామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు. మేడిగడ్డ కుంగిపోవడాన్ని కేవలం ఒక చిన్న పగులు గా కొట్టిపారేస్తూ, ఈ కూలేశ్వరం వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుతో పోలిక పెట్టడం ఇప్పుడు పెద్ద హాస్యాస్పదంగా మారింది.
"పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు.. మేము మాత్రం మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేశాం" అంటూ కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక ప్రాథమిక లాజిక్‌ను ఆయన మర్చిపోయారు. పోలవరం అనేది గోదావరి నదిపై నిర్మిస్తున్న ఒక భారీ గ్రావిటీ అల్ట్రా-మెగా డ్యామ్. దశాబ్దాలుగా ఎంతో పకడ్బందీగా, క్వాలిటీతో కేంద్ర నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారు కాబట్టే.. వరదలు వచ్చినా ఆ నిర్మాణం చెక్కుచెదరకుండా నిలబడింది. ఒకవేళ పోలవరాన్ని కూడా కాళేశ్వరం తరహాలో నాసిరకం ఇంజనీరింగ్ డిజైన్లతో, కమీషన్ల కక్కుర్తితో ఆషామాషీగా కట్టి ఉంటే.. ఆ భారీ వరద ఉధృతికి గోదావరి దిగువన ఎంతటి ఘోరమైన ఊచకోత జరిగి ఉండేదో, ఎంత డ్యామేజీ జరిగి ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
నిజానికి, కాలయాపన అయినా సరే పద్ధతిగా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా కట్టడం గొప్పే కానీ.. రికార్డుల కోసం హడావుడిగా కట్టేసి, మొదటి రెండేళ్లకే పునాదులు కుంగిపోయేలా చేయడం ఏ రకమైన విజన్? కార్యకర్తలను వేల సంఖ్యలో రోడ్లపైకి తెచ్చి, పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు.. రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోంది అని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటే తాత్కాలికంగా రాజకీయం నడుస్తుందేమో కానీ.. లక్ష కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైందనే నిజాన్ని మార్చలేరనేది కాంగ్రెస్ నేతుల చెబుతున్న మాట. కాళేశ్వరాన్ని తెచ్చి పోలవరంతో పోల్చుకున్నంత మాత్రాన.. కూలిపోయిన మేడిగడ్డ పునాదులు మళ్లీ లేవవు, కాళేశ్వరం పాపాలు కొట్టుకుపోవు అని అంటున్నారు.

