Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలవరం ..వేగంగా నిర్వాసితుల పరిహారం!

పోలవరం ..వేగంగా నిర్వాసితుల పరిహారం!

Telugu 360 1 week ago

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కేవలం కాంక్రీటు కట్టడం కాదు, అది కోట్లాది మంది ప్రజల శతాబ్దాల స్వప్నం. అదే సమయంలో, ఈ మహా యజ్ఞం కోసం తమ సర్వస్వాన్ని, సొంత గడ్డను త్యాగం చేసిన లక్షలాది మంది నిర్వాసితుల కన్నీటి గాథ కూడా.

ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత ముఖ్యమో, దానికి కారణమైన త్యాగమూర్తులను ఆదుకోవడం అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వరుసగా నిర్వాసితులకు పరిహారం పంపిణీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నేరుగా సమావేశమై, నాలుగో విడతగా రూ. 306.61 కోట్ల పరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను స్వయంగా అందజేశారు. ప్రాజెక్ట్ అంటే కేవలం గోడలు కట్టడం కాదు.. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయడమే అసలైన విజయంగా ప్రభుత్వం బావిస్తోంది. స్పష్టమైన విజన్‌తో కూడిన పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి గత 23 నెలల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేవలం రికార్డు కాలంలో నాలుగు విడతలుగా మొత్తం రూ. 2,250 కోట్లను 29,936 మంది నిర్వాసితులకు పంపిణీ చేసింది.

నిర్వాసితులందరికీ కాలనీల నిర్మాణం

ఇల్లు నిర్మించుకోవడానికి ఇచ్చే సహాయాన్ని రూ. 3.5 లక్షలకు, ఇంటి స్థలం కోసం ఇచ్చే మొత్తాన్ని రూ. 2 లక్షలకు పెంచి ఇవ్వడం ద్వారా బాధితులలో ఒక బలమైన భరోసాను కల్పించారు. కేవలం పరిహారమే కాకుండా, ఆర్ అండ్ ఆర్ కాలనీలలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన కల్పిస్తోంది. నాడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన రీయంబర్స్మెంట్ నిధులను ఇతర పథకాలకు దారిమళ్లించి, నిర్వాసితుల ప్యాకేజీని గాలికొదిలేసిందనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో నిజమని రుజువయ్యాయి. రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లను మార్చడం వల్ల ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడమే కాకుండా, నిర్వాసితులు గోదావరి వరదల్లో మునిగి అల్లాడినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ప్రాజెక్టు పనులను పూర్తిగా పక్కనబెట్టి, కేవలం రాజకీయం కోసమే పోలవరాన్ని వాడుకున్నారనే విమర్శలకు నాడు బాధితులకు ఒక్క రూపాయి కూడా సరిగ్గా చెల్లించకపోవడమే సజీవ సాక్ష్యంగా నిలిచింది.

గోదావరి పుష్కరాల్లోపు ప్రాజెక్ట్ పూర్తి

ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 86 శాతానికి పైగా పూర్తి అయ్యాయి. 2027లో రాబోయే గోదావరి మహా పుష్కరాల కంటే ముందే.. అంటే వచ్చే ఏడాది నాటికి పోలవరం తొలిదశ నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి తొలిదశ ఆర్అండ్ఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా సాగునీటి రంగానికి, మానవతా విలువలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని స్పష్టమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360