Dailyhunt
ప్రధాని మోదీకి నారా లోకేష్ ధన్యవాదాలు!

ప్రధాని మోదీకి నారా లోకేష్ ధన్యవాదాలు!

Telugu 360 3 weeks ago

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకలగా కలిసిన లోకేష్, ఐదు కోట్ల ఆంధ్రుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రధాని మార్గదర్శకత్వం ఎంతో అవసరమని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ప్రధానితో భేటీ అనంతరం లోకేష్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసి, ఏళ్ల తరబడి అనిశ్చితిని ఎదుర్కొని కూడా మొక్కవోని దీక్షతో నిలబడిన రైతుల వీరగాథను ప్రధానికి వివరించాను. వారి త్యాగాన్ని గౌరవిస్తూ, అమరావతిని అత్యుత్తమ రాజధానిగా నిర్మించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. కేవలం ప్రధానిని కలవడమే కాకుండా, సభలో అమరావతికి మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్క ఎంపీని వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం లోకేష్ పరిణతిని చాటిచెప్పింది.

రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందే చారిత్రక ఘట్టాన్ని గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్, ఆ తర్వాత వివిధ పార్టీల జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. ఒక రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్న అంశంపై ఆయన కనబరిచిన అంకితభావం, ఢిల్లీ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంది. పక్షపాత రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ నేతలను సమన్వయం చేసుకున్న తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

లోకేష్‌లోని ఈ కొత్త కోణాన్ని చూసిన జాతీయ నాయకులు, ఆయనను గొప్ప నాయకత్వ లక్షణాలున్న యువ నేత గా అభివర్ణించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలబడి, ఇప్పుడు ఫలితాలను సాధించడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్, భావి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయబోతున్నారని ఈ పర్యటనతో స్పష్టమైంది. అమరావతి స్వప్నం సాకారం దిశగా అడుగులు పడుతున్న తరుణంలో, లోకేష్ ఢిల్లీ పర్యటన టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360