Dailyhunt
ప్రజల్ని నిందించలేదు స్టాలిన్ !

ప్రజల్ని నిందించలేదు స్టాలిన్ !

Telugu 360 6 days ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎం.కె. స్టాలిన్ వ్యవహరించిన తీరు, ఆయన స్పందన ప్రజాస్వామ్యంలో ఏం చేసినా ప్రజలే కరెక్ట్ అని అంగీకరించేలా ఉంది.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమి ఎదురైనప్పుడు ప్రజలను తప్పుబట్టకుండా, వారి తీర్పును శిరసావహించే సంస్కారం ఒక గొప్ప నాయకుడి లక్షణం. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల తీరు భిన్నం.

ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజలు తప్పు చేశారు అనో, మా పథకాలు తీసుకుని మాకు ఓట్లేయలేదనో విమర్శించిన నేతల్ని చూశాం. ఇప్పటికీ ప్రజలు తప్పు చేశారని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిపోయిన నేతలు చెబుతూ ఉంటారు. కానీ, స్టాలిన్ తన అపజయాన్ని విశ్లేషించుకుంటూనే, కేవలం 3.52 శాతం ఓట్ల వ్యత్యాసాన్ని ఎత్తిచూపి కేడర్‌లో ధైర్యాన్ని నింపారు. ఓటమిని నిరాశగా కాకుండా, ప్రజల వద్దకు మళ్లీ వెళ్లేందుకు ఒక అవకాశంగా మార్చుకోవాలని పిలుపునివ్వడం ఆయన పరిణతికి నిదర్శనం.

వెంటనే ప్రజల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పండి అని స్టాలిన్ తన అభ్యర్థులకు సందేశం ఇచ్చారు. ఓటమిలోనూ బాధ్యతను గుర్తుచేసుకునేలా.. అధికారం ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడతామనే భరోసా ఇవ్వడమే అసలైన రాజకీయం. సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలే ప్రాణం అని ఆయన చెప్పిన మాటలు నాయకత్వ లక్షణానికి నిదర్శనం.

మరోవైపు తెలుగు రాజకీయాల్లో గెలిచినప్పుడు మితిమీరిన గర్వం, ఓడినప్పుడు ప్రజలపై అక్కసు వెళ్లగక్కడం తరచూ చూస్తుంటాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు. వారిని నిందించడం అంటే వ్యవస్థను అవమానించడమే. అందుకే, ఓటమిని హుందాగా స్వీకరించి, బలమైన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తామన్న స్టాలిన్ ఆశావహ దృక్పథం ఆకట్టుకుంటోంది. ప్రజల మనసు గెలవాలంటే ముందు వారి తీర్పును గౌరవించడం నేర్చుకోవాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360