Dailyhunt
ప్రమోషన్లు ఫుల్.. కలక్షన్లు నిల్

ప్రమోషన్లు ఫుల్.. కలక్షన్లు నిల్

Telugu 360 2 weeks ago

వేసవి సీజన్‌ని తెలుగు చిత్రసీమ క్యాష్ చేసుకోవడంలో విఫలం అవుతోంది. ఏప్రిల్ లో కొన్ని సినిమాలొచ్చినా, స్టార్ హడావుడి కనిపించలేదు. మేలోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

మే తొలి వారంలో మూడు సినిమాలు బాక్సాఫీసు దగ్గర వరుస కట్టాయి. కర, గాయపడ్డ సింహం, జెట్లీ ప్రేక్షకుల్ని పలకరించాయి. హిందీ సినిమా ఏక్ దిన్ కూడా వచ్చింది. సాయి పల్లవి నటించిన సినిమా కాబట్టి, తెలుగు ప్రేక్షకులు కాస్త ఫోకస్ పెట్టారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

కానీ వీటిలో ఒక్క సినిమానీ ఆదరణ దక్కడం లేదు. శుక్రవారం థియేటర్లు ఖాళీగా కనిపించాయి. మేడే సెలవు దినం అయినా కూడా.. జనాలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించలేదు. గాయపడ్డ సింహం, జెట్లీ పోటాపోటీగా ప్రమోషన్లు చేశాయి. పబ్లిసిటీలో పీక్ అంటే ఏమిటో చూపించాయి. ఈ సినిమాల ప్రమోషన్ కంటెంట్ బాగా ఆకట్టుకొంది. సినిమాలకు యావరేజ్‌, బిలో యావరేజ్ రేటింగులు వచ్చాయి. అయితే ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకురావడానికి ఈ దమ్ము సరిపోవడం లేదు. శనివారం కూడా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కనీసం బీ,సీ సెంట్లలోనూ టికెట్లు తెగడం లేదు. ధనుష్ సినిమాలకు సీ సెంటర్లో ఫుట్ ఫాల్స్ బాగుంటాయి. ఈసారి ఆ పరిస్థితి కూడా లేదు.

ఓవైపు ఎండలు భగభగలాడుతున్నాయి. మరోవైపు ఐపీఎల్ గండం ఉంది. మార్నింగ్ షోలకు వడగాల్పులు, నైట్ షోల్ని ఐపీఎల్ అడ్డు గోడలుగా మారుతున్నాయి. దాంతో పాటు సరైన కంటెంట్ రావడం లేదన్నది నిజం. ప్రమోషన్లు ఎంత భారీగా చేస్తున్నా, పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360