తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన బదిలీల నిర్ణయాలపైనా రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి, సీనియర్ ప్రభుత్వ అధికారిణి లక్ష్మీబాయిని ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టు నుండి సహకార శాఖ పరిధిలోని హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ బదిలీ నేరుగా ముఖ్యమంత్రి చేయించారని… కనీసం వాహన సౌకర్యం కూడా లేకుండా చేయాలనే కుట్రతోనే అప్రాధాన్య పోస్టుకు పంపారంటూ విమర్శలు ప్రారంభఇంచారు.
ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత సిబ్బందితో పాటు కారు సౌకర్యాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించి పాక్షిక ఉపశమనం పొందారు. అక్కడ రిలీఫ్ దక్కడంతో తట్టుకోలేకే, ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా భార్యను టార్గెట్ చేసిందని, రేవంత్ రెడ్డి హిట్లర్‌లా వ్యవహరిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆర్ఎస్పీ అంటున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య అయినంత మాత్రాన ఆమెకు ఎప్పుడూ లూప్‌లైన్ కాకుండా కేవలం ప్రాధాన్యత కలిగిన పోస్టులనే కేటాయించాలా అనే ప్రశ్న ఇతరుల నుంచి వస్తోంది.
ఒక ప్రభుత్వ అధికారిగా నియమితులైనప్పుడు ఏ శాఖలోనైనా, ఏ బాధ్యతలనైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఆమె భర్త బీఆర్ఎస్‌లో ఉన్నారని చెప్పి, గతంలో అనుభవించిన అన్ని లగ్జరీలు, వాహన సౌకర్యాలు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకోవడం.. బదిలీ చేస్తేనే భయపడి వేధించినట్లు కలరింగ్ ఇవ్వడం విడ్డూరంగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి. లక్ష్మీబాయిని ఉద్యోగం నుంచి తొలగించలేదు కదా, కేవలం ఒక విభాగం నుండి మరో విభాగానికి బదిలీ చేసిన దానికి ప్రభుత్వం భయపడిపోయింది అంటూ సింపతీ నరేటివ్స్ బిల్డ్ చేయడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విధమైన మైండ్ గేమ్స్ , కక్షసాధింపు కార్డ్ ప్లే చేయడం ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఏం సాధిస్తారో కానీ.. పరిపాలనలో బదిలీలు అనేవి ప్రభుత్వాల విచక్షణాధికారాలనే ప్రాథమిక నిజాన్ని వారు ముందుగా తెలుసుకోవాలని పెదవి విరుస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రతీ చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్‌ను కూడా రాజకీయ కోణంలోనే చూస్తూ, హిట్లర్ పాలన అంటూ పెద్ద పెద్ద పదాలతో బురదజల్లడం చూస్తుంటే.. ప్రభుత్వ పనితీరుపై అవగాహన లేమితో పాటు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే ఈ రకమైన రచ్చ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

