Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పురందేశ్వరికి కేబినెట్ ర్యాంక్  ?

పురందేశ్వరికి కేబినెట్ ర్యాంక్ ?

Telugu 360 3 days ago

కేంద్రంలోని నరేంద్ర మోదీ చేపట్టబోయే మిడ్-టర్మ్ కేబినెట్ ప్రక్షాళన వార్తలు తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి.

ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ఏపీ నుంచి బీజేపీ జాతీయ నేత, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం ఢిల్లీ , అమరావతి రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో ఆమెను లోక్‌సభ స్పీకర్‌గా , ఇతర రాజ్యాంగబద్ధమైన పదవుల్లో నియమిస్తారంటూ రకరకాల ఊహాగానాలు సాగినప్పటికీ, అంతిమంగా ఆమెను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడమే ఉత్తమమనే నిర్ణయానికి బీజేపీ అగ్రనాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది.

సీనియారిటీ, క్లీన్ ఇమేజ్‌కు పెద్దపీట!

ప్రధాని మోదీ, అమిత్ షా ఈసారి కేబినెట్ విస్తరణలో 'పనితీరు - అనుభవం ప్రాతిపదికన మార్పులు చేయనున్నారు. గతంలో యూపీఏ-1 , యూపీఏ-2 ప్రభుత్వాల హయాంలో పురందేశ్వరి ఏకంగా పదేళ్ల పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి , వాణిజ్య-పరిశ్రమల శాఖలకు సహాయ మంత్రిగా సుదీర్ఘ అనుభవాన్ని గడించారు. పార్లమెంట్‌లో ఆమెకున్న వాగ్ధాటి, వివాదరహిత ఇమేజ్, జాతీయ స్థాయి నేతలతో ఉన్న పరిచయాలు ఆమెకు ప్రధాన అర్హతలుగా మారాయి. ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమెను ప్రతిష్టాత్మకమైన మహిళా సాధికారత కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమించడం కూడా ఆమెకు కేబినెట్ బెర్త్ ఖరారైందనే సంకేతాలకు బలం చేకూరుస్తోంది.

కూటమి బలోపేతం!

మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ పురందేశ్వరి నియామకంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసి, గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి కేంద్రంలో కేబినెట్ ర్యాంకుతో టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. బీజేపీ కోటాలో కూడా ఒక బలమైన, సీనియర్ క్యాబినెట్ మంత్రి ఉండాలని ఏపీ బీజేపీ క్యాడర్ కోరుకుంటోంది. పురందేశ్వరి లాంటి అగ్రనేతకు కేంద్ర కేబినెట్‌లో కీలక శాఖ దక్కితే, అది రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు.. కూటమి ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఒక సమర్థవంతమైన వారధిగా ఉపయోగపడుతుందని అమరావతి వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కేబినెట్ హోదాతో కీలక శాఖ?

మోదీ కేబినెట్‌లో కేబినెట్ ర్యాంక్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళా కోటాతో పాటు ఎన్టీఆర్ కుమార్తెగా తెలుగు ప్రజల్లో ఆమెకున్న ఆదరణను మోదీ ప్రభుత్వం గౌరవించబోతోందని సమాచారం. మానవ వనరులు, విద్య, లేదా వాణిజ్య రంగాలపై ఆమెకున్న పాత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెకు సరిపోయేలా ఒక ప్రాధాన్యత కలిగిన పోర్ట్‌ఫోలియోను కేటాయించే అవకాశం ఉంది. జూన్‌లో జరగబోయే అధికారిక విస్తరణ తర్వాత.. చిన్నమ్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలైనట్లే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360