Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ కన్నా ప్రియాంకనే నమ్ముతున్న కాంగ్రెస్ క్యాడర్

రాహుల్ కన్నా ప్రియాంకనే నమ్ముతున్న కాంగ్రెస్ క్యాడర్

Telugu 360 2 hrs ago

కాంగ్రెస్ నాయకత్వంలో అంతర్గతంగా ఒక కీలకమైన వ్యూహాత్మక మార్పు జరుగుతోంది. రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను, ప్రచార సారథ్యాన్ని రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ వాద్రాకే అప్పగించాలని భావిస్తున్నారు.

రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత స్థానానికే పరిమితమవుతుండగా.. క్షేత్రస్థాయిలో అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను ప్రియాంక భుజాలకెత్తేలా రోల్ డివిజన్ జరుగుతోంది.

రాహుల్ కన్నా ప్రియాంకే ఎక్కువ క్రౌడ్ పుల్లరా

రాష్ట్రాల ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రచార శైలికి వస్తున్న ప్రజా స్పందన, ఆమె సక్సెస్ రేట్. గతంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నప్పుడు సైతం ప్రియాంక నేతృత్వంలో సాగిన దూకుడు ప్రచారం కాంగ్రెస్‌కు అద్భుత ఫలితాలనిచ్చింది. ముఖ్యంగా ఆమె ప్రసంగించే తీరు, ప్రజలతో మమేకమయ్యే విధానం, తన నాయనమ్మ ఇందిరా గాంధీని గుర్తుకు తెచ్చే హావభావాలు ఉత్తర, మధ్య భారత ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్థానిక నేతల మధ్య ఉండే గ్రూపు తగాదాలను చక్కదిద్దడంలోనూ, మహిళా ఓటర్లను ప్రభావితం చేయడంలోనూ ప్రియాంక అనుసరించే శైలి రాహుల్ కంటే చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది.

రాష్ట్రాల ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్‌గా మార్చకుండా కాంగ్రెస్ ప్లాన్

మోదీ వర్సెస్ రాహుల్ గా మార్చి రాష్ట్ర స్థాయి ఎన్నికలను సైతం జాతీయీకరణ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. అయితే, ప్రియాంక రంగంలోకి దిగితే ఆ సమీకరణం మారుతుంది. ఆమె స్థానిక సమస్యలు, ధరల పెరుగుదల, మహిళా సంక్షేమం, నిరుద్యోగం వంటి అంశాల చుట్టూనే ప్రచారాన్ని నడిపిస్తూ బీజేపీపై ఎదురుదాడి చేస్తారు. దీనివల్ల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను స్థానిక అంశాలపైనే ఉంచడం కాంగ్రెస్‌కు సాధ్యమవుతోంది. ఎంపీగా గెలిచిన తర్వాత ప్రియాంక కేవలం తెరవెనుక సంస్థాగత సర్దుబాట్లు చూసే నాయకురాలిగా కాకుండా.. పూర్తిస్థాయి మాస్ లీడర్‌గా ఆమెను ముందంజలో ఉంచాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారు.

రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉంటే ప్రియాంక ఏం చేయగలరు?

ఈ అంశంలో కొన్ని సవాళ్లు లేకపోలేదు. ప్రియాంక ఇమేజ్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. స్థానిక బలమైన నాయకత్వం, గ్రౌండ్ లెవల్ బూత్ మేనేజ్‌మెంట్ లేకపోతే కేవలం వ్యక్తుల చరిష్మాతోనే ఎన్నికలను గెలవలేమని గత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమయింది. అయినప్పటికీ, కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ ఒక సంజీవనిలా కనిపించే ప్రియాంక ఫ్యాక్టర్‌ను.. ఈసారి పూర్తిస్థాయిలో ప్రయోగించి అసెంబ్లీ పోరుల్లో బీజేపీని నిలువరించాలని అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉంది. రాహుల్-ప్రియాంకల ఈ సరికొత్త పవర్ షేరింగ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల స్థాయిలో ఎంతవరకు పునరుజ్జీవాన్ని తెస్తుందో రాబోయే ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360