Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్, ప్రియాంక నమ్మకాన్ని రేవంత్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారా?

రాహుల్, ప్రియాంక నమ్మకాన్ని రేవంత్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారా?

Telugu 360 6 days ago

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ శైలి ప్రస్తుతం అటు రాష్ట్రంలోనూ, ఇటు జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటికి మొన్న హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్న తరుణంలో జరిగిన పరిణామాలు, ఆపై వెలువడిన రాజకీయ విశ్లేషణలు కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపాయి.

అయితే, రేవంత్ రెడ్డిపై ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం చూపిస్తున్న మాట నిజమే అయినప్పటికీ.. ప్రధాని మోదీ , బీజేపీ అగ్రనేతలతో రేవంత్ మరీ అంత సన్నిహితంగా ఉంటే మొదటికే మోసం వస్తుందనే హెచ్చరికలు కూడా రాజకీయ నిపుణుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.

బీజేపీతో రేవంత్ ప్రోటోకాల్ స్నేహంపై హైకమాండ్ కన్ను

టీడీపీ కాలేజీ, బీజేపీ స్కూల్ నుంచి వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డి..ఒక మీడియా కాన్క్లేవ్‌లో మాట్లాడుతూ 2034 వరకు తానే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసి ఆయన తదుపరి స్థానంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ధీమా వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం పట్ల తనకు ఉన్న అచంచలమైన విధేయతను చాటుకుంటూనే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీనే నిలబెడతామని స్పష్టం చేశారు. అధిష్టానాన్ని ఈ స్థాయిలో ప్రసన్నం చేసుకుంటున్న రేవంత్.. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో నడుపుతున్న ప్రోటోకాల్ స్నేహం వెనుక ఉన్న అసలు లోతుపాతులను కాంగ్రెస్ హైకమాండ్ నిశితంగా గమనిస్తూనే ఉంది.

ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి!

ఇటీవలి అధికారిక సభలో మోదీ చేసిన కొన్ని చమత్కార వ్యాఖ్యలు, దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి కేంద్ర-రాష్ట్ర సంబంధాల కోసమే ఈ సహకారం అంటూ ఇచ్చిన క్లారిటీలు తాత్కాలికంగా సరిపెట్టుకునేలా ఉన్నా.. దీర్ఘకాలంలో ఇది కాంగ్రెస్ మూలాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి, అభివృద్ధి ప్రాజెక్టుల అనుమతుల కోసం ప్రధానమంత్రిని శత్రువుగా చూడాల్సిన పని లేదు. కానీ, సైద్ధాంతికంగా మరియు పార్లమెంటరీ పంథాలో మోదీని ఒక బలమైన రాజకీయ ప్రత్యర్థి గా మాత్రం క్షేత్రస్థాయిలో గట్టిగా ఢీకొట్టాల్సిందే. అలా కాకుండా వ్యక్తిగత సత్సంబంధాల నెపంతో బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి ప్రదర్శించినా, అది రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్‌ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తుంది.

మాటలతో కాదు..బీజేపీతో చేతలతో పోరాడాలి !

పరిపాలనలో కేంద్రంతో సఖ్యత అవసరమే అయినా.. రాజకీయ వ్యూహాల్లో ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా పీఠం దించే శక్తులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాచుకుని కూర్చుంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ వైఖరిపై రకరకాల ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో, రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని కేవలం బ్యాలెన్సింగ్ కోసమే కాకుండా, ప్రత్యర్థిని రాజకీయంగా అణచివేయడానికి కూడా ఉపయోగించాలి. ఢిల్లీ పెద్దల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే, అటు ప్రధాని మోదీని రాజకీయ క్షేత్రంలో సమర్థవంతంగా ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి ముందున్న అత్యంత సంక్లిష్టమైన మరియు అవసరమైన సవాలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360