నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది వర్సెస్ దక్షిణాది మధ్య పెద్ద చర్చకు దారితీసింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతాయన్న ఆందోళన వాస్తవమే అయినా, దానిని పరిష్కరించే విషయంలో రాజకీయ పార్టీల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దక్షిణాది ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాజకీయం చేస్తోంది.
దక్షిణాది ప్రాధాన్యతను కాపాడే మార్గమేది?
నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగపరమైన ప్రక్రియ . రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన చేయాలి. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటం, దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను నియంత్రించడంతో.. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం పార్లమెంటులో గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ సీట్లు 80 నుంచి 120కి పెరిగితే, కేరళ లేదా తమిళనాడు సీట్ల పెరుగుదల చాలా స్వల్పంగా ఉంటుంది. దీనివల్ల దేశ ప్రధానిని నిర్ణయించే శక్తిలో దక్షిణాది పాత్ర నామమాత్రంగా మారుతుందన్నది ప్రధాన భయం.
అన్యాయం అంటున్న కాంగ్రెస్ - 50 శాతం ఫార్ములాపైనా వ్యతిరేకత
ఇటీవల ఇదే అంశంపై నారా లోకేష్, పి. చిదంబరం మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. చిదంబరం వాదన ప్రకారం.. ఆర్టికల్ 81ని మార్చకుండా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది సాపేక్ష బలం తగ్గుతుంది. దీనికి లోకేష్ సమాధానమిస్తూ, మీరు అంటున్నట్లు ఆర్టికల్ 81 వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే, దానిని అడ్డుకోవడానికి ఎన్డీఏ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది అని ప్రశ్నించారు. అంటే, సమస్యను గుర్తించినా దాని పరిష్కారానికి కేంద్రం తెచ్చిన బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని లోకేష్ ఆరోపించారు.
హైబ్రిడ్ మోడల్ .. పరిష్కారమా? సమస్యనా?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. సీట్ల పంపిణీ కేవలం జనాభా మీద కాకుండా, 50 శాతం జనాభా.. మరో 50 శాతం ఆయా రాష్ట్రాల జీఎస్డీపీ ఆధారంగా ఉండాలని ఆయన కోరారు. ఈ ఫార్ములా లోనూ దక్షిణాదికి అన్యాయమే జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు సమస్యను ఎత్తిచూపుతున్నారు కానీ, ప్రత్యామ్నాయంగా ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగని ఖచ్చితమైన ఫార్ములా ను ఇవ్వడంలో వెనుకబడుతున్నారు. మరోవైపు కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు ద్వారా ప్రతి రాష్ట్రానికి సీట్లు పెరుగుతాయి కాబట్టి ఎవరికీ నష్టం లేదని బీజేపీ వాదిస్తోంది. కానీ ఇక్కడ సంఖ్య పెరగడం ముఖ్యం కాదు, నిష్పత్తి ముఖ్యం. నిష్పత్తి తగ్గనివ్వబోమని కేంద్రం భరోసా ఇస్తోంది.
కాంగ్రెస్ వల్ల దక్షిణాదికి అన్యాయం
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పెంచడం లేదా ఆర్థిక సంఘం కేటాయింపుల్లో జనాభాను కాకుండా అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకోవడం వంటివి చేయాలి. కాంగ్రెస్ నేతలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, రాజ్యసభలో లేదా ఇతర చట్టసభల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా బలమైన రాజ్యాంగపరమైన రక్షణలను ప్రతిపాదించాలి. సమస్యను పరిష్కరించడం మానేసి పెద్దది చేయడం వల్ల దక్షిణాది ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ కాంగ్రెస్‌కు కావాల్సింది రాజకీయమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

