'పెద్ది' తో బుచ్చిబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడని ఇండస్ట్రీ గట్టిగా నమ్ముతోంది. సంక్రాంతి తరవాత పెద్ద సినిమా రాలేదు. 'పెద్ది' తో ఆ లోటు తీరాలి.
మళ్లీ బాక్సాఫీసు దగ్గర గలగలలు వినిపించాలి. ఇండస్ట్రీ మొత్తం ఇదే కోరుకొంటోంది. అదృష్టవశాత్తూ.. ఈ సినిమాకి ముందు నుంచీ పాజిటీవ్ బజ్ నడుస్తోంది. పాటలు, గ్లింప్స్ ఇవన్నీ చరణ్ ఫ్యాన్స్ కి విపరీతంగా ఎక్కేశాయి. ఇప్పుడు బుచ్చిబాబు ఇంటర్వ్యూల పర్వం మొదలైంది. ముఖాముఖిలో బుచ్చి ఇస్తున్న స్టేట్ మెంట్లు, తన మాటల్లో కనిపిస్తున్న విజన్ ఈ సినిమాపై హైప్ మరింత పెంచేస్తున్నాయి. `పెద్ది` ష్యూర్ షాట్ హిట్ అని అంతా కన్‌ఫామ్ అయిపోయారు. రేంజ్ ఏమిటన్నది ఆడియన్స్ డిసైడ్ చేయాలి.
సినిమా ఫలితం ఎలా ఉండబోతోంది? అనేది పక్కన పెడితే చరణ్ తో బుచ్చిబాబుకి స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. చరణ్ - బుచ్చిల అనుబంధం చూస్తుంటే, ఒకరి గురించి మరొకరు చెబుతున్న మాటలు వింటుంటే ముచ్చటేస్తోంది. ఈ బంధం ఒక్క సినిమాకే ఆగిపోదు. మళ్లీ మళ్లీ ఈ కాంబో చూస్తాం. అందుకే బుచ్చి చెబుతున్న మాటలే సాక్ష్యం. సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తరవాత 'నన్ను మర్చిపోవుగా' అని చరణ్ బుచ్చిబాబుతో అన్నార్ట. ఈ విషయం బుచ్చినే చెప్పాడు. అదీ.. వాళ్ల బాండింగ్.
ఈమధ్య చరణ్ సోషల్ మీడియాలో కొన్ని కొత్త ఫొటోలు షేర్ చేశారు. అందులో చరణ్ లుక్స్ స్టన్నింగ్ గా కనిపించాయి. ఈ ఫొటోలు షేర్ చేస్తూ… 'మళ్లీ ఇంకో ఛాన్స్ ఇవ్వండిసార్' అంటూ బుచ్చి కూడా ట్వీట్ చేశాడు. బుచ్చితో మళ్లీ కలిసి పనిచేయాలని చరణ్ కూడా భావిస్తున్నాడు. మరి వీరిద్దరూ కలిసి చేసే తదుపరి సినిమా ఎలా ఉంటుంది? తెలుగు360కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న వచ్చింది. దీనిపై బుచ్చి స్పందించిన తీరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "చరణ్ తో నేను చేయబోయే నెక్ట్స్ సినిమా ఎలా ఉంటుందనద్నది మీ ఊహలకు కూడా అందదు. పాయింట్ చెప్పేశాను. ఆయనకు నచ్చింది. అన్నీ కుదిరితే.. మా సినిమా తప్పకుండా ఉంటుంది" అని ఫ్యాన్స్ కి ఓ తీపి కబురు చేరవేశాడు బుచ్చిబాబు.
`పెద్ది` హిట్టయితే.. చరణ్ తో బుచ్చి మళ్లీ పని చేయడం ఖాయం. ఆ క్షణాల కోసం చరణ్ అభిమానులు కూడా ఇప్పటి నుంచే ఎదురు చూపుల్లో పడిపోతారు.

