ఈ రోజుల్లో పెద్ద హీరోలు హిట్ సినిమాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో, సరైన లైనప్‌ను సిద్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సరైన సమయంలో మంచి కథలు, సరైన దర్శకులు కుదరకపోతే అనుకోని గ్యాప్‌లు వచ్చేస్తుంటాయి.
అందుకే ఇప్పుడు పెద్ద హీరోలు ఒక సినిమా చేస్తూనే మరో రెండు, మూడు ప్రాజెక్టులను లాక్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ ముందుచూపుతో అడుగులు వేస్తున్నారు. జూన్ 4న 'పెద్ది' రిలీజ్ అవుతుంది. ఆ సినిమా తర్వాత కూడా వరుసగా బలమైన ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నారు చరణ్. ఆయన రాబోయే సినిమాల జాబితా చూస్తే వచ్చే ఐదేళ్ల వరకు ఎలాంటి హైరానా లేకుండా సినిమాలపై ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.
'పెద్ది' తర్వాత చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ సుకుమార్‌తోనే. 'రంగస్థలం' రూపంలో ఒక మైలురాయి చిత్రాన్ని అందించిన ఈ కాంబినేషన్ మరోసారి జట్టు కడుతున్నారు. 'రంగస్థలం' తర్వాత 'పుష్ప'తో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుకున్నారు సుకుమార్. అలాగే చరణ్ కూడా ఆర్ఆర్ఆర్, ఇప్పుడు పెద్దితో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. మార్కెట్, బిజినెస్, క్రేజ్ పరంగా ఇది అత్యంత పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.
మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా చరణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగాయి. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో భారతీయ మాస్ యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రశాంత్ నీల్, చరణ్ ఇమేజ్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా చరణ్‌కు కథ చెప్పారు. ఆ కథపై చరణ్ ఆసక్తిగా ఉన్నారని టాక్. భన్సాలీ సినిమాలు అంటే గ్రాండియర్, విజువల్ రిచ్‌నెస్, భావోద్వేగాలకు పెట్టింది పేరు. బాక్సాఫీస్ విజయాలతో పాటు కళాత్మక విలువలు కూడా ఆయన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే చరణ్ కెరీర్‌లో పూర్తిగా భిన్నమైన సినిమా అవుతుంది.
మొత్తానికి చూస్తే రామ్ చరణ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. సుకుమార్, ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ లాంటి విభిన్న స్టైల్స్ వున్న దర్శకులతో ప్రాజెక్టులు లైన్లో ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ లైనప్ చూస్తుంటే వచ్చే ఐదేళ్ల వరకు ప్రాజెక్టుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే లాక్ చేసిన సినిమాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

