Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయదుర్గంలో ఎకరం @రూ. 237 కోట్లు

రాయదుర్గంలో ఎకరం @రూ. 237 కోట్లు

Telugu 360 0 months ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో స్టేజ్‌కు వెళ్లింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిసరాల్లోని పాన్ మక్తా ప్రాంతంలో సర్వే నంబర్ 83/1 పరిధిలో గల 6 ఎకరాల 29 గుంటల ప్రీమియం భూమికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ గురువారం ఈ-వేలం నిర్వహించింది.

ఈ వేలంలో దేశీయ రియల్ ఎస్టేట్ వర్గాలు ముక్కున వేలేసుకునేలా ఒక్కో ఎకరం ధర అక్షరాలా రూ. 237 కోట్లు పలికి సరికొత్త ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది.

రాయదుర్గంలోని మైండ్‌స్పేస్ ఐటీ పార్క్, టి-హబ్ , టి-వర్క్స్, క్వాల్‌కామ్ క్యాంపస్, రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు అత్యంత సమీపంలో వ్యూహాత్మకంగా ఉన్న ఈ భూమి కోసం దేశంలోని దిగ్గజ డెవలపర్లు, ఫార్మా కంపెనీలు పోటాపోటీగా బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. టిజీఐఐసీ ఈ ప్లాట్‌కు నిర్ణయించిన కనీస ధర ఎకరానికి రూ. 139 కోట్లు కాగా.. గంటల తరబడి సాగిన హోరాహోరీ ఈ-వేలంలో ధర ఏకంగా రూ. 237 కోట్లకు చేరుకుంది. చివరకు ప్రముఖ నిర్మాణ సంస్థ గౌర వెంచర్స్ ఈ రికార్డు స్థాయి ధరతో సదరు భూమిని సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఎకరం రూ. 177 కోట్లకు ఎమ్ఎస్ఎన్ రియల్టీ దక్కించుకోగా.. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఆ బెంచ్‌మార్క్‌ను కూడా తుడిచిపెట్టేసింది.

ఈ భూమికి ఇంత భారీ స్థాయిలో గిరాకీ ఏర్పడటానికి ప్రధాన కారణం దీనికి ఉన్న మల్టీ-యూజ్ కేటగిరీ నిబంధనే. అంటే, ఈ ల్యాండ్‌ను కొనుగోలు చేసిన సంస్థ ఎలాంటి పునఃసమీక్షలు, ప్రత్యేక అనుమతులు లేకుండానే అటు కమర్షియల్ స్కైస్క్రాపర్లు, హై-రైజ్ లగ్జరీ రెసిడెన్షియల్ టవర్లు, ప్రీమియం ఐటీ స్పేస్ లేదా సెవెన్ స్టార్ హోటల్స్ వంటి ఏ అవసరాలకైనా వాడుకోవచ్చు. దీనికి తోడు క్లియర్ టైటిల్స్ ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు , శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ ఉండటం, అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ లభించడంతో అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

ప్రస్తుతం పలికిన రూ. 237 కోట్ల ఎకరం ధరతో ముంబైలోని నారిమన్ పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ,దిల్లీ ల్యుటెన్స్ జోన్ వంటి అత్యంత ఖరీదైన నగరాల సగటు వాణిజ్య భూముల విలువను హైదరాబాద్ దాటేసింది. కేవలం ఒకే ఒక్క ప్లాట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 1,500 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఈ వేలం ఫలితాలతో కేవలం రాయదుర్గం, గచ్చిబౌలి మాత్రమే కాకుండా.. దీని ప్రభావం చుట్టుపక్కల ఉన్న కోకాపేట, తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్ మైక్రో-మార్కెట్లపై కూడా పడి, రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్లోబల్ ఇన్వెస్టర్లకు మరింత హాట్ కేక్‌గా మారబోతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360