2026 దసరా సీజన్ అంటే ఈసారి మామూలు పోటీ కాదని మొదటి నుంచీ అనుకున్నారు. రజినీకాంత్ 'జైలర్ 2', చిరంజీవి 'విశ్వంభర', వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం'..
ఇలా పెద్ద సినిమాలు ఒకదాని వెంట ఒకటి బరిలో ఉండటంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయాయి.
చిరంజీవి 'విశ్వంభర' దసరా రేసు నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తోంది. సీజీ వర్క్‌ల్లో జాప్యం వల్ల ఈ సినిమాని తీసుకురావడం లేదని తెలుస్తోంది. అందుకే చిరు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. తాజాగా విజయ్ దేవరకొండ 'రణబాలి' అక్టోబర్ 16న విడుదల కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక అసలు ట్విస్ట్ 'జైలర్ 2' విషయంలో.
రజినీకాంత్-నెల్సన్ కాంబినేషన్‌లో వస్తున్న 'జైలర్ 2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం షూటింగ్ పూర్తయిందని రజినీకాంత్ స్వయంగా చెప్పారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. అధికారికంగా అయితే అక్టోబర్ 15 రిలీజ్ డేట్‌నే ఉంది. సన్ పిక్చర్స్ అధికారిక సైట్‌లో కూడా ఇదే తేదీ కనిపిస్తోంది.
అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరమవుతుందన్న కారణంతో సినిమా నవంబర్‌కు వాయిదా పడొచ్చనే టాక్ కూడా వచ్చింది. దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ లేదు. అంటే.. జైలర్ 2 దసరా రేసు నుంచి తప్పుతుందన్నది ప్రస్తుతానికి వార్త మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు.
కానీ ఒకవేళ అదే జరిగితే మాత్రం దసరా లెక్కల్లో భారీ మార్పే వస్తుంది. ఎందుకంటే రణబాలికి అప్పుడే కావాల్సినంత స్పేస్ దొరుకుతుంది ఇప్పటికే 'రణబాలి' అక్టోబర్ 16న వస్తున్నట్టు ప్రకటించారు. ఆ తేదీకి ఒక రోజు ముందు 'జైలర్ 2' ఉంది. అంటే ప్రస్తుతం రణబలి ఎదుర్కోబోయే అతి పెద్ద పోటీ రజినీకాంత్ సినిమాతోనే. 'విశ్వంభర' కూడా రేసులో లేకపోతే.. 'జైలర్ 2' కూడా తప్పుకుంటే.. విజయ్ దేవరకొండ దసరా సీజన్‌లో చాలా విలువైన స్పేస్ దొరికినట్టే.
దసరా చాలా పండగ. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాస్.. ఇలా అన్ని సెక్షన్లు థియేటర్ల వైపు చూస్తాయి. పైగా సెలవుల వల్ల సినిమాకు మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే కలెక్షన్లను లాంగ్ రన్‌లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా విజయ్ దేవరకొండకు ఇది చాలా కీలకమైన సినిమా. వరుస పరాజయాలకు ఈ సినిమాతో బ్రేక్ పడాలని ఫ్యాన్స్ కోరుకొంటున్నారు. 'రణబాలి' సాధారణ కమర్షియల్ సినిమా కాదు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 19వ శతాబ్దపు నేపథ్యంతో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. పెళ్లయ్యాక విజయ్ - రష్మిల జోడీ చేసిన సినిమా ఇది. కాబట్టి అదొక అదనపు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సుంది.
విశ్వంభర, జైలర్ తప్పుకొన్నాంత మాత్రాన రణబాలికి సోలో రిలీజ్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఇంకొన్ని సినిమాలు కూడా పోటీ పడొచ్చు. కానీ.. అందరి దృష్టి రణబాలిపైనే ఉంటుంది. సో.. విజయ్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి.

