Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రమణీ కల్యాణం' రివ్యూ: మితి మీరిన మెలోడ్రామా

'రమణీ కల్యాణం' రివ్యూ: మితి మీరిన మెలోడ్రామా

Telugu 360 2 days ago

తెలుగు360 రేటింగ్‌: 1.5/5

కొన్ని కథలు పుస్తకాల్లో, నవల్స్‌లో చదవడానికి బాగుంటాయి. చెప్పుకోవడానికి బాగుంటాయి. అలా బాగున్న ప్రతీ కథా.. సినిమాగా మారొచ్చు.

మారకపోవొచ్చు. రెండింటికీ ఉన్నది చిన్న తేడానే. ఆ కథని `డీల్` చేసే విధానం. ఓ కథని చదివేటప్పుడు ఎలాంటి అనుభూతికి లోనవుతామో.. చూసేటప్పుడు కూడా అదే ఫీలింగ్ రావాలి. హృదయాన్ని హత్తుకొనేలా తీర్చిదిద్దగలగాలి. లేదంటే వృధా ప్రయాసే. 'రమణీ కల్యాణం' సినిమా చూస్తున్నప్పుడు కథగానో, నవలగానో, పర్సనాలిటీ డవలప్‌మెంట్ క్లాస్ గానో.. 'బాగుంది' అనిపిస్తుంది. మరి వెండితెరపై కూడా అదే ఫీలింగ్ వచ్చిందా? కొంతమంది కొత్తవాళ్లు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఏ మేరకు ఆకట్టుకోగలిగింది?

సంజన (దీప్షిక చంద్రన్‌) చిన్నప్పుడు ఓ కారు ప్రమాదంలో కన్నవాళ్లతో పాటుగా కళ్లు పోగొట్టుకొంటుంది. ఒక్కర్తే మిగులుతుంది. అయినా కృంగిపోదు. తనలాంటి నలుగురు అనాథ పిల్లల్ని చేరదీసి పెంచుతుంది. ఓ పబ్ లో పాటలు పాడుతూ.. తనవాళ్లని పోషించుకొంటుంది. మరోవైపు రాజ్ (సూర్య వశిష్ట) కథ. క్రికెటర్ అవ్వాలని ఎన్నో ఆశలతో కష్టపడతాడు. జాతీయ జట్టులోనూ స్థానం సంపాదిస్తాడు. కానీ అదే రోజు.. ఓ ప్రమాదంలో తన కాళ్లు పోగొట్టుకొంటాడు. అప్పటి నుంచీ నిరాశ, నిస్పృహలతో బతుకుతుంటాడు. అయితే ఓరోజు పబ్ లో సంజన పాట విని.. తనపై ఆసక్తి పెంచుకొంటాడు. స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమగా మారుతుంది. వీరిద్దరి మధ్య బంధం బలపడుతున్న సమయంలో రాజ్ కి సంబంధించిన ఓ విషయం బయటపడుతుంది. అదేమిటి? ఆ తరవాత ఏం జరిగింది? అనే విషయాలు వెండి తెరపై చూడాలి.

లోపాలు, త్యాగాలు, కష్టాలు, కన్నీళ్ల మధ్య నలిగిపోయిన కథ ఇది. హీరోకి కాళ్లుండవు. హీరోయిన్ కి కళ్లుండవు.. అంటూ ఓ కథ మొదలెడితే సినిమా తీయడానికి ఆ నిర్మాతకు ధైర్యం ఉండదు. అందుకే ఈ సినిమాకు దర్శకుడే నిర్మాతగా మారాల్సివచ్చింది. హీరోయిన్ కళ్లు లేకపోయినా ఆత్మస్థైర్యంతో జీవిస్తుంటుంది. హీరో తన లోపాన్ని తలచుకొంటూ కుమిలిపోతుంటాడు. హీరోయిన్ రాక వల్ల హీరో జీవితం పూర్తిగా మారిపోతుంది.. ఇలా ఓ కథ చెబితే.. ఈరోజుల్లో ఈ సినిమాని ఎవరు చూస్తారు? అనే అనుమానం వేస్తుంది. ఇలాంటి కథలు టీవీల్లో కథనాలుగా వస్తే.. చూసి స్ఫూర్తి పొందొచ్చేమో? సినిమాగా మారిస్తే మాత్రం ట్రీట్ మెంట్ సరిగ్గా జరగాలి. ఎమోషన్ ని సరైన కొలతలతో జోడించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఈ కథలో అవేం జరగలేదు. హీరో చాలా డల్ గా కనిపిస్తుంటాడు. హీరోయిన్ హుషారుగా ఉన్నా - అదంతా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంటుంది. ఫ్రెండు క్యారెక్టర్ (శ్రీనివాసరెడ్డి) బలవంతంగా ఎమోషన్లు పండించడానికి ఆపసోపాలు పడుతుంటాడు.

ఇలాంటి పేతాస్ కథని చెప్పకూడదని కాదు. కానీ దానికి అన్నీ కుదరాలి. చాలా సీన్లు పైపైనే సాగిపోతుంటాయి. ఏదీ ప్రోపర్ గా మొదలవ్వదు, పూర్తవ్వదు. తరవాతి సీన్ ఇలా జరగాలి కాబట్టి, దాని ముందు సీన్ ఇది.. అనేలా ఉంటుంది తప్ప.. ఆర్గానిక్ గా కుదిరినట్టు అనిపించదు. ఇంట్రవెల్ బ్యాంగ్ ఓ హీరోకి ఓ సమస్య ఉందని తెలుస్తుంది. అక్కడే క్లైమాక్స్ లో ఏం జరగబోతోందో ఊహిస్తాడు ప్రేక్షకుడు. క్లైమాక్స్ అంతా త్యాగమే. ఆ సీన్లు చూస్తుంటే చాలా సినిమాలు గుర్తొస్తాయి. `గీతాంజలి` లో కూడా హీరో, హీరోయిన్ క్యారెక్టర్లకు లోపాలు, రోగాలూ ఉంటాయి. కానీ.. ఆయా పాత్రలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయి. `వీళ్లు బతకాలి.. వీళ్ల ప్రేమ బతకాలి` అనిపించేలా సన్నివేశాలు సాగుతాయి. సింపతీ కోసం పాత్రలు ఎదురు చూడవు. ప్రేక్షకులే సింపతైజ్ అవుతారు. కాబట్టి ఆ సినిమా క్లాసిక్ అయ్యింది. ఇక్కడ మాత్రం `మీరు సింపతీ ఫీలవ్వాల్సిందే` అనేలా డైలాగులు ఉంటాయి. ప్రేక్షకులపై పేతాస్ ని రుద్దిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఆ పాత్రలకు కనెక్ట్ అవ్వడం కష్టమైపోతుంది.

సూర్య వశిష్ట చూడ్డానికి బాగున్నాడు. తనది హీరో ఫేసే. కానీ చక్రాల కుర్చీకి పరిమితం చేసేశారు. సంజన కూడా బాగుంది. కానీ ఎందుకో డైలాగ్ మనస్ఫూర్తిగా చెప్పలేకపోతోంది. ప్రతీ మాటా మనసులోంచి రావాలి. కానీ అది జరగడం లేదు. శ్రీనివాసరెడ్డిది ఎమోషనల్ గా ఫీలవ్వాల్సిన పాత్ర. కానీ ఎందుకో తాను న్యాయం చేయలేకపోయాడు. చాలా రోజుల తరవాత శ్యామల వెండి తెరపై కనిపించింది. అది కూడా లెంగ్తీ పాత్రలో.

'కోర్టు' సినిమా దర్శకుడు రామ్ జగదీష్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. స్క్రీన్ ప్లేలోనూ ఆయన ప్రమేయం ఉంది. కానీ ఈ రెండు విభాగాలూ ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. చాలా డైలాగులు తేలిపోయాయి. సీన్లు భారంగా అనిపించాయి. సగం సినిమా పూర్తయ్యేసరికే.. నీరసం ఆవహిస్తుంది. స్క్రిప్టు పరమ వీక్ గా అనిపించింది. ఈరోజుల్లో ఇంత సింపతీ, ఇంత మెలోడ్రామా ప్రేక్షకులు భరించడం కష్టం. అయినా సరే, ఈ కథని కేటర్ చేయాలి అనుకొంటే.. జనరేషన్‌కి నచ్చేలా ట్రీట్ చేయాలి. పాత తరహా కథని, అంతే పాతగా ట్రీట్ చేయడం వల్ల పాత్రలవైపు పుట్టాల్సిన సింపతీ.. సినిమా చూసిన ప్రేక్షకులపై మళ్లుతుంది.

తెలుగు360 రేటింగ్‌: 1.5/5

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360