చరిత్ర ఎప్పుడూ పాఠమే. క్లిష్టంగా ఉంటుంది. దాన్ని తెరపై తీసుకొచ్చేటప్పుడు ఆ సంక్లిష్టత ఇంకా పెరుగుతుంటుంది. చరిత్రని చందమామ కథలా చెప్పడం కూడా ఒక ఆర్టే.
దానికి నేరేషన్ స్కిల్ అవసరం. చరిత్రలో ఉన్న అంకెలకూ, వాస్తవాలకూ ఓ ఎమోషన్ జోడించినప్పుడే.. పాఠం పాటలా గుర్తుంటుంది. 'రణబాలి' కూడా చరిత్రే. కరవుతో అల్లాడిపోయిన గత చరిత్ర. గింజ దొరక్క లక్షల ప్రాణాలు కోల్పోయిన కటిక నిజం. బ్రిటీష్ వాళ్ల స్వార్థపు చిత్రం. దాన్ని కథగా చెప్పాలన్న ప్రయత్నం నిజాయితీతో కూడింది. అయితే.. ముందే చెప్పినట్టు చరిత్రని చరిత్రలా కాకుండా చందమామ కథలా చెప్పడం తెలిసి ఉండాలి. మరి ఆ ట్రిక్… రాహుల్ సంకృత్యాన్ ఎంత వరకూ ఒడసి పట్టుకొన్నాడు, విజయ్ దేవరకొండ - రష్మిక జోడీ.. ఈ చరిత్రకు జవసత్వాలు ఎంత వరకూ అందించింది? ఇది అంకెల, లెక్కల పాఠమా లేదంటే ఆత్మని సంతరించుకొన్న పాటనా?
1870ల నాటి కథ ఇది. అప్పట్లో కరవు విశ్వరూపం చూపించింది. దానికి తోడు బ్రిటీష్ వాళ్ల అరాచకాలు. దేశంలో ఉన్న ప్రతీ గింజనీ ఇంగ్లండ్ పంపించాలన్న లక్ష్యంతో, పన్నుల భారం మోపి, ఆ రూపేణా పంటని లాగేసుకొంటుంటాడు బ్రిటీష్ కమీషనర్ (ఆర్నాల్డ్ వస్లూ). దేశంలోని అన్ని ప్రాంతాలూ కమీషనర్ అరాచకాలకు తలొంచుతాయి. ఒక్క సింగనమల ప్రాంతం తప్ప. ఆ ప్రాంతానికి రక్షకుడు సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ). మనిషి మొండోడు. అంతకు మించి వీరుడు. 5 లక్షల టన్నుల పంటని ఇంగ్లండ్ తరలించాలన్న లక్ష్యంతో దోచుకొంటున్న బ్రిటీష్ దొరకు.. 'రణబాలి' అడ్డుగా నిలుస్తాడు. ఆ పోరులో ఏం జరిగింది? తానొక్కడే బలమైన బ్రిటీష్ సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? రణబాలి భార్య జయమ్మ (రష్మిక) పాత్రేమిటి? ఇవన్నీ రణబాలి చూసి తెలుసుకోవాలి.
ఇదో చరిత్ర పాఠం అని, ఏ పుస్తకంలో పొందుపరచని కఠినమైన నిజమని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ముందే చెప్పాడు. అలాంటి కథని తెరపైకి తీసుకురావాలన్న ప్రయత్నం అభినందించదగినది. ఈ రూపంలో అయినా సరే - ఆ రోజుల్లో ఏం జరిగిందన్న నిజం అర్థం అవుతుంది. గుప్పెడు బియ్యం దొరక్క ఎంత మంది అల్లాడిపోయారో అర్థం అవుతుంది. ఈ సినిమా చూసినప్పుడు, ఆకథ తెలుసుకొంటున్నప్పుడు తినే ఆహారాన్ని వృథా చేయకూడదన్న స్పృహ కాస్తయినా కలుగుతుంది. ఈ విషయంలో చిత్రబృందం విజయం సాధించినట్టే. అయితే చరిత్రని సినిమాగా తీయడం అంత ఈజీ కాదు. ఉన్నది ఉన్నట్టు చెబితే డాక్యుమెంటరీ అయిపోతుంది. కల్పన జోడించి, కమర్షియల్ టచ్ ఇస్తే నిజం మరుగున పడిపోతుంది. ఈ రెండు విషయాల్లో సమతూకం పాటించాలి. రాహుల్ సంకృత్యాన్ ఈ విషయంపై కొంత వర్క్ చేసినట్టే అనిపిస్తుంది. అందుకే.. రణబాలి అనే పాలెగాడి కథకు మిస్టరీని జోడించాడు. చివరి అంకం కోబలి అందుకు సంబంధించిన ఎక్స్‌టెన్షనే కావొచ్చు. రణబాలి కారణ జన్ముడని, ఓ కార్యం పూర్తి చేయడానికే ఈ లోకంలో అడుగుపెట్టాడంటూ ఆ పాత్రకు కొంత మిస్టరీ ఆపాదించాడు. జయమ్మ ట్రాక్ కూడా కమర్షియల్ యాంగిల్ కోసం పుట్టిందే కావొచ్చు. సినిమా అనేసరికి అన్నీ ఉండాలి కాబట్టి, ఈ జోడింపులు తప్పు కాదు. మేకింగ్ లో, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ లో సిన్సియారిటీ కనిపించింది.
అయితే నేరేషన్ అనేది పూర్తిగా ఇబ్బంది పెట్టింది. ప్రతీ విషయాన్నీ డీటైల్డ్ గా చెప్పాలన్న ఉద్దేశంతో నిడివి పెంచుకొంటూ పోయాడు. దాంతో ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలంటే డీటైలింగ్ అవసరమే. కానీ టూమచ్ డీటైలింగ్ కూడా ఎమోషన్ ని కిల్ చేస్తుందన్న విషయాన్ని గ్రహించాలి. కథలో హీరో పాత్రని కచ్చితంగా ప్రేక్షకుడు ఓన్ చేసుకొంటాడు. కానీ అదొక్కటే సరిపోదు. మిగిలిన పాత్రలపై కూడా సింపతీ కలగాలి. అప్పుడే ఈ పోరాటం వర్కవుట్ అవుతుంది. కానీ అది జరగలేదు. ఫస్టాఫ్ లో పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. అలాగని.. కళ్లప్పగించి చూసే సీన్లు కూడా పడవు. రష్మికతో విజయ్ కెమిస్ట్రీ ఎలాంటిదో మనకు తెలుసుకాబట్టి, పాత్రల్ని వాళ్ల బంధాన్నీ త్వరగా ఓన్ చేసుకొంటాం. రణబాలి ఎంట్రీ ఫైట్.. అక్కడ చూపించే ఎమోషన్ ఇవి ఓకే అనిపిస్తాయి. ఓవరాల్ గా.. ఫస్టాఫ్ పాసైపోతుంది తప్ప, ఓ గొప్ప చరిత్ర కళ్లతో చూశామన్న ఫీలింగ్ అయితే రాదు. దానికి కారణం.. నేరేటీవ్ స్టైల్.
సెకండాఫ్ లో రణబాలి బ్రిటీష్ వాళ్లపై దాడి చేయడం, ఆకలి అన్నవాళ్లకు తిండి పెట్టడం.. ఇదే రిపీటెడ్ మోడ్ లో సాగుతుంటుంది. గుహలో ఫైట్ బాగా డిజైన్ చేసినా, అంతకు ముందు సీన్లో ఎమోషన్ అంతగా వర్కవుట్ అవ్వలేదు. షిప్ ని అడ్డుకొని, ధాన్యాన్ని తరలించినప్పుడే కథ అయిపోయింది. కానీ.. ఆ తరవాత కూడా ఓ అంకం జోడించారు. అది ఎక్స్టెన్షన్ లా అనిపిస్తుందంతే. రణబాలి పాత్రకు దైవత్వం ఆపాదించే ప్రయత్నం కూడా పూర్తిగా ఫిక్షనల్ మైండ్ సెట్ తో రాసుకొన్న సీన్లు. క్లైమాక్స్ ఇలానే ఉండాలి అని దర్శకుడు అనుకొంటే, అంతకు ముందు సీన్లు ట్రిమ్ చేయాల్సింది. ఆ ప్రయత్నం లేకపోవడంతో ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు చూశామన్న ఫీలింగ్ వస్తుంది. ఓవర్ డ్రమటైజ్ ఎప్పుడూ నిజాన్ని కప్పేస్తుంది. అందుకే చరిత్రను సినిమాగా తీస్తున్నప్పుడు రచయితలు జాగ్రత్తగా ఉండాలి. చరిత్ర జనంలోకి వెళ్లాలంటే డ్రమటైజేషన్ తగ్గించుకోవాలి. కమర్షియాలిటీనే ముఖ్యం అనుకొంటే చేసేదేం ఉండదు.
విజయ్ దేవరకొండ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. విజయ్‌కున్న నెగిటివిటీకి చిన్న తప్పు చేసినా.. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారు. అందుకే ఆ తప్పులేం లేకుండా జాగ్రత్త పడ్డాడు. తన సిన్సియర్ ఎఫర్ట్ ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది. రష్మిక పాత్ర కూడా హుందాగా ఉంది. విజయ్ - రష్మిక జోడీని స్క్రీన్ పై మళ్లీ మళ్లీ చూడాలనిపించింది. మమ్మీ ఫేమ్ విలన్ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. హాలీవుడ్ స్థాయి విలన్ ని తెలుగు తెరపై చూసుకోవడం గొప్పగా అనిపిస్తుంది. ఈశ్వరీ రావు తల్లి పాత్రలో మరోసారి మెప్పించారు.
అజయ్ - అతుల్ అందించిన పాటల్లో ఏందయ్యా సామీ వినగానే నచ్చేస్తుంది. దాన్ని తెరపై చూపించిన విధానం కూడా బాగుంది. మిగిలిన పాటలు ఏమంత ఎఫెక్టీవ్ గా అనిపించవు. బీజియం కూడా అంతంత మాత్రమే. కొన్ని సీన్లు ఎలివేట్ అవ్వకపోవడానికి వీక్ బీజియం ఓ కారణమైంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్న సినిమా ఇది. 1880ల నాటి వాతావరణాన్ని పునః సృష్టించారు. కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ వంక పెట్టడానికి లేకుండా ఉన్నాయి. రాహుల్ సంకృత్యాన్ ఉద్దేశ్యం గొప్పదే. దాన్ని తనదైన స్టైల్ లో డీల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ.. స్లో నేరేషన్, రొటీన్ స్క్రీన్ ప్లే ఇబ్బంది పెట్టాయి. ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఇదే. కనీసం అరగంట సినిమా ట్రిమ్ చేసుకోవొచ్చు. అప్పుడు ఎమోషన్ ఇంకాస్త బలంగా వర్కవుట్ అయ్యేది.
