Dailyhunt
రేవంత్ ఫోర్ పవర్ సెంటర్స్ !

రేవంత్ ఫోర్ పవర్ సెంటర్స్ !

Telugu 360 1 week ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి క్రమబద్ధంగా వెళ్లడం లేదనే విమర్శలు ప్రతిపక్షాల నుండి వెల్లువెత్తుతున్న తరుణంలో, ఆయన మద్దతుదారులు, ప్రభుత్వ వర్గాలు మద్దతుగా కొత్త ఫార్ములాను తెరపైకి తెస్తున్నాయి.

పాలన కేవలం ఒకే భవనానికి పరిమితం కాకూడదని, సాంకేతికతను వాడుకుంటూ నగరం నడిబొడ్డున ఉన్న నాలుగు కీలక వేదికలను ఆయన తన పరిపాలనా గ్రిడ్‌గా మార్చుకున్నారని సమర్థించుకుంటున్నారు.

ఇల్లు.. లేకపోతే ఎంసీఆర్ హెచ్చార్డీ

ముఖ్యమంత్రి తన జూబ్లీహిల్స్ నివాసం నుండే ఆధునిక పాలనను నడిపిస్తున్నారు. ఇక్కడ ట్యాబ్ ద్వారా e-Office ఫైళ్లను పర్యవేక్షించడం, డిజిటల్ సంతకాలు చేయడం ద్వారా సీఎం ఎక్కడున్నా ఫైలు ఆగదు అనే సంకేతాన్ని ఇస్తున్నారు. సచివాలయానికి వెళ్తేనే పని జరుగుతుందనే పాత ధోరణిని కాకుండా, డిజిటల్ గవర్నెన్స్ ద్వారా సమయాన్ని ఆదా చేస్తున్నారు. ఇల్లు తర్వాత రేవంత్ ఎక్కువగా నివాసానికి అతి సమీపంలో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షణా కేంద్రానికి వెళ్తున్నారు. శాఖాపరమైన సుదీర్ఘ సమీక్షలు, అధికారులతో అంతర్గత సమావేశాలకు దీనిని ప్రధాన వేదికగా మార్చుకున్నారు. సచివాలయానికి వెళ్లి ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా, తక్కువ సమయంలో ఎక్కువ సమీక్షలు నిర్వహించడానికి ఈ వర్కింగ్ హబ్ ఆయనకు అత్యంత సౌకర్యవంతంగా మారింది.

కేబినెట్ వంటి కీలక సమావేశాలకు సచివాలయానికి

కేబినెట్ మీటింగ్స్, కలెక్టర్ల కాన్ఫరెన్స్ వంటి భారీ అధికారిక కార్యక్రమాల కోసం మాత్రమే ఆయన సచివాలయాన్ని వాడుకుంటున్నారు. తద్వారా అక్కడ రద్దీని తగ్గించి, కీలకమైన విధానపరమైన నిర్ణయాలకు ఆ వేదికను పరిమితం చేస్తున్నారు. సచివాలయానికి వచ్చినప్పుడు తరచూ జర్నలిస్టులతో జరిపే చిట్-చాట్‌ల ద్వారా ప్రభుత్వ వెర్షన్‌ను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడ నిరంతరం ఉండటం కంటే, అవసరమైనప్పుడు వెళ్లి అందరినీ కలుసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ పాలన

కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనూ రేవంత్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడి భారీ డిజిటల్ స్క్రీన్లు, లైవ్ డేటా అనలిటిక్స్‌ను వాడుకుంటూ, ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తోందనే గ్లోబల్ ఇమేజ్ ను బిల్డ్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఆఫీస్ కాదు, తెలంగాణ ప్రగతికి ఒక టెక్నికల్ షోకేస్ లా ఉపయోగించుకుంటున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ఆధునిక వేదికలనే రేవంత్ రెడ్డి ఇప్పుడు తనదైన శైలిలో మరింత సమర్థవంతంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఫామ్‌హౌస్‌కో.. ప్రగతి భవన్‌కో పరిమితం కాకుండా.. పూర్తి స్థాయిలో ఆయన ప్రజల మధ్య ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పడం కష్టం. కానీ పనులు మాత్రం ఆగవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360