Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్ సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే కోర్టుల్లో షాకులు!

రేవంత్ సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే కోర్టుల్లో షాకులు!

Telugu 360 5 days ago

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు ఫ్లైఓవర్లను నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది.

పార్క్ చుట్టూ ఉన్న 25 నుండి 35 మీటర్ల పరిధిలోని ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను నరకకూడదని స్పష్టం చేసింది. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతున్న సమయంలో తలెత్తే న్యాయపరమైన చిక్కులను ముందే ఊహించి, వాటిని ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమవడం వల్లనే ఇలాంటి సమస్య వస్తోంది.

వాదనల్లో పస లేని ప్రభుత్వ తీరు

నిజానికి ప్రభుత్వం ఒక్క చెట్టును కూడా నరకడం లేదని చెబుతోంది. కానీ అదే విషయాన్ని కోర్టుకు చెప్పడంలో విఫలమయ్యారు. ఎకో సెన్సిటివ్ జోన్‌లో భారీ నిర్మాణాల వల్ల కలిగే పర్యావరణానికి నష్టం జరగకుండా చేస్తున్నామని కోర్టుకు వివరించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారో గట్టిగా వాదించలేకపోవడం, అవసరమైన పర్యావరణ అనుమతులపై స్పష్టత లేకపోవడమే ఈ స్టే కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కోర్టులో ప్రభుత్వ వాదనలు బలహీనంగా ఉండటం వల్లే ఇప్పుడు పనులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

ప్రభుత్వానిదే బాధ్యత

ఫ్లైఓవర్ల పనులు ఆగిపోవడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు మాత్రమే కాదు ప్రజల సొమ్ము మరియు సమయం వృధా అవుతున్నాయి. ప్రభుత్వం ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు డిజైన్ దశలోనే అటవీ శాఖ, పర్యావరణ నిపుణులు , న్యాయ నిపుణులతో సమన్వయం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు పనులు ఆగిపోతే ఆ నెపం కేవలం అధికారుల మీదనే కాకుండా, నేరుగా ప్రభుత్వం మీదే పడుతుంది. గతంలో కంచ గచ్చిబౌలి విషయంలోనూ ఇలాగే జరిగినా ప్రభుత్వం అప్రమత్తం కాలేదు.

అభివృద్ధి వర్సెస్ పర్యావరణం

అభివృద్ధి అవసరమే అయినా, అది ప్రకృతిని బలితీసుకుంటూ జరగకూడదన్నది న్యాయస్థానం ఉద్దేశం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, కేబీఆర్ పార్క్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో నిర్మాణాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా ముందుకు వెళ్తేనే ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు సజావుగా సాగుతాయి. లేదంటే ఇవి కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360